గాల్లో తేలిపోతూ అందంగా కనిపించే గాలి బుడగల్ని చూస్తేనే ఒక రకమైన ఆనందం. ఇక వాటిని చేతుల్లో పొదివి పట్టుకోవాలన్న ప్రయత్నం పసితనం నుంచే మొదలవుతుంది. కానీ అలా వాటిని అరచేతులలో ఒడిసిపట్టడం అనుకున్నంత సులభమైన పనేం కాదు! అందుకే ఆ అందాలను నగల రూపంలో తీర్చిదిద్దారు డిజైనర్లు.
అచ్చం గాలి బుడగలను పూలమాలలా గుదిగుచ్చి గొలుసుగా చేశారేమో అనిపించేంత సహజంగా కనిపిస్తాయివి. ఇవే తరహాలో గొలుసుకు సెట్ అయ్యేలా రెండు మూడు బబుల్స్ని కలిపి చెవిపోగులనూ రూపొందిస్తున్నారు. గాజు, ఫైబర్లాంటి వాటితో వీటిని తయారు చేస్తున్నారు. ‘బబుల్ జ్యువెలరీ’గా పిలుస్తున్న ఇవి యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ… క్రేజీ క్రేజీ.. ఫ్యాషన్.. అని పాడుకుంటూ బుడగల్ని మెడలో ధరిస్తున్నారు అమ్మాయిలు.