చిత్రసీమలో ‘బంధుప్రీతి’ని ఓ పెద్ద సమస్యగా అభివర్ణిస్తున్నది బాలీవుడ్ నటి శిఖా తల్సానియా. వారసత్వం అనేది అన్ని రంగాల్లో ఉన్నదనీ, అయినా.. చిత్రసీమలోనే భూతద్దంలో పెట్టి వెతుకుతుంటారని విమర్శిస్తున్నది. సీనియర్ నటుడు టికు తల్సానియా కుమార్తె శిఖా తల్సానియా. తండ్రి పేరును ఎక్కడా వాడుకోకుండానే.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ఆఫ్ స్క్రీన్‌లో కెరీర్‌ను ప్రారంభించిన శిఖా.. ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టింది. సినిమాలు, టెలివిజన్ షోలలో పలు ఆకర్షణీయమైన పాత్రలతో మెప్పించింది.
అరంగేట్ర చిత్రం.. ‘వేక్ అప్ సిద్’తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ఆ తర్వాత వీరే ది వెడ్డింగ్, స్కూప్, శాంతి క్రాంతి వంటి టీవీ సిరీస్‌లతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరిశ్రమలో బంధుప్రీతిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నది. తన తండ్రి వారసత్వాన్ని కూడా ప్రస్తావించింది. బాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడి కూతురినైనా.. తన తండ్రి పేరును ఎక్కడా వాడుకోలేదని చెప్పుకొచ్చింది. “నేను ఎన్నో ఆడిషన్స్‌కు హాజరయ్యా! ఎన్నో తిరస్కరణలు చూశా.
ఎక్కడా నా పూర్తి పేరును ఇవ్వలేదు. ఇప్పటికీ ఎవ్వరు అడిగినా.. నాపేరు ‘శిఖా టి’ అని మాత్రమే చెబుతాను. నా పనితీరుతోనే నాకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నా” అని వెల్లడించింది. ఇక బాలీవుడ్లో బంధుప్రీతి అనేది ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుందనీ, కానీ, తాను మాత్రం అదో పెద్ద సమస్యగానే చూస్తానని చెప్పుకొచ్చింది. “కళలతోసహా అనేక రంగాల్లో బంధుప్రీతి ఉంది. అయినా, అందరి దృష్టీ చిత్రసీమలోని వారసులపైనే ఉంటుంది.
వారసత్వంతోని సినిమా అవకాశాలు వచ్చినా.. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే, టాలెంట్ ఉండాల్సిందే!” అని పేర్కొన్నది. అయితే, ‘నెపో కిడ్స్’కు కొన్ని వెసులుబాట్లు ఉంటాయనీ.. ఇక్కడి సాధకబాధకాలు వారికి ముందుగానే తెలుస్తాయనీ అభిప్రాయపడింది. శిఖా తండ్రి టికు తల్సానియా సీనియర్ నటుడు కాగా, ఆమె సోదరుడు రోహాన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. దాంతో, ఆమెకు పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్నది. ప్రస్తుతం శిఖా హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్.. ‘మిస్త్రీ’లో నటిస్తున్నది. రామ్ కపూర్, మోనా సింగ్ వంటివారితో కలిసి తెరను పంచుకుంటున్నది. ప్రముఖ డిటెక్టివ్ సిరీస్ ‘మాంక్’కు ఇండియన్ రీమేక్‌గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నది.