ఆడవాళ్లపై రోజురోజుకూ వేధింపులు పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు.. ఎల్లప్పుడూ బౌన్సర్ల రక్షణలో ఉండే సెలెబ్రిటీలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తానుకూడా రెండుమూడు సార్లు వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్. తాజాగా, ఓ ఆన్లైన్ మీడియాతో మాట్లాడుతూ.. తనను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలను పంచుకున్నది. “ఒకసారి ఒక వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు. దాంతో నేను అతణ్ని కొట్టాను. అయితే, నేను ఎదురు తిరగడం అతనికి కోపం తెప్పించింది. దాంతో నన్ను చాలా బలంగా కొట్టాడు. నేను కింద పడిపోయాను కూడా!” అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నది.
ఆ రోజు తాను చాలా కుంగిపోయినట్లు చెప్పుకొచ్చింది. అయితే.. ఆ తర్వాత తనలో పెద్ద మార్పే వచ్చిందట. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో, ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నదట. “ఆ సంఘటన తర్వాత నేను కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా తెలుసుకున్నాను” అని వెల్లడించింది. అలాంటిదే మరో సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. లాక్డౌన్ సమయంలో మాస్క్ ధరించి సైకిల్‌పై వెళ్తున్నప్పుడు.. ఒక టెంపో డ్రైవర్ ఫాతిమాను ఇబ్బందికి గురిచేశాడట. హారన్ మోగిస్తూ, వింతవింత శబ్దాలు చేస్తూ.. తనను చాలాదూరం అనుసరించాడట.
ఇలా మహిళలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయనీ, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనీ పిలుపునిస్తున్నది ఫాతిమా. సినిమాల విషయానికి వస్తే.. మాధవన్‌తో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘ఆప్ జైసా కోయి’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ‘మెట్రో ఇన్ దినో’లోనూ కీలకపాత్రలో కనిపించింది. ‘షేక్ చాచి 420’తో బాలనటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఫాతిమా సనా షేక్. 2016లో ఆమిర్‌ఖాన్ ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ పాత్రను పోషించింది. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత లూడో, అజీబ్ దాస్తాన్స్, మోడ్రన్ లవ్ ముంబయి ప్రాజెక్ట్‌లలోనూ నటించింది. ఇటీవల ‘సామ్ బహదూర్’ చిత్రంలో ‘ఇందిరా గాంధీ’గా కనిపించి.. మెప్పించింది.