‘బ్లాంకెట్స్’ అంటే చలికాలంలో మాత్రమే వాడుకునేవి అనుకుంటారు. అయితే, వేసవిలోనూ చల్లగా నిద్రపోయేందుకూ బ్లాంకెట్స్ ఉపయోగపడతాయి. అవే.. కూలింగ్ బ్లాంకెట్స్! సాధారణ దుప్పట్ల కన్నా భిన్నంగా ఉండే ఈ బ్లాంకెట్స్.. ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
శరీరంలోని అదనపు వేడిని కూలింగ్ బ్లాంకెట్స్ పీల్చుకుని, దేహానికి చల్లని అనుభూతిని కలిగిస్తాయి. దాంతో రాత్రిపూట చెమట పట్టడం తగ్గుతుంది.
సాధారణ దుప్పట్లు వేడిని లోపలే బంధిస్తాయి, కానీ, వెదురు, యూకలిప్టస్, ప్రత్యేకమైన నైలాన్ మిశ్రమంతో తయారయ్యే కూలింగ్ బ్లాంకెట్స్.. గాలిని సులభంగా లోపలికి పంపిస్తాయి. చెమటను త్వరగా ఆవిరి చేస్తాయి.
శరీరం చల్లగా ఉన్నప్పుడు ‘మెలటోనిన్’ అనే నిద్ర హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. అదే వేసవిలో వేడి వల్ల ఈ హార్మోన్ తక్కువగా విడుదలవుతుంది. దాంతో, నిద్ర మధ్యలో మెలకువ వస్తుంది. అయితే కూలింగ్ బ్లాంకెట్స్ మన శరీరానికి స్థిరమైన ఉష్ణోగ్రతను అందిస్తాయి. నిరంతరాయంగా గాఢ నిద్ర పోవడానికి సాయపడతాయి.
కూలింగ్ బ్లాంకెట్లు వాడేటప్పుడు ఏసీని మరీ తక్కువ ఉష్ణోగ్రతలో పెట్టాల్సిన అవసరం ఉండదు. దాంతో, ఏసీపై భారం తగ్గడంతోపాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది.
ఈ బ్లాంకెట్లలో యాంటి బ్యాక్టీరియల్, హైపో అలెర్జెనిక్ లక్షణాలు ఉంటాయి. వేసవిలో వచ్చే చెమట కాయలు, స్కిన్ అలర్జీల నుంచి ఇవి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
కూలింగ్ బ్లాంకెట్లు శరీరం అతిగా వేడెక్కకుండా కాపాడతాయి. తద్వారా రాత్రంతా మరింత సౌకర్యవంతంగా నిద్రపోయేలా చేస్తాయి.