e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home జిందగీ తెలంగాణ భాషా దినోత్సవం | ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్‌ అంబాసిడరైంది..

తెలంగాణ భాషా దినోత్సవం | ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్‌ అంబాసిడరైంది..

Jordar Sujatha | చేతిలో కవర్‌ సంచి, రెండు జతల బట్టలు. హన్మకొండలో బస్సెక్కి హైదరాబాద్‌లో దిగింది. ఇక్కడ అయినోళ్లెవరూ లేరు. అంతా గజిబిజి, గందరగోళం. ఊరు భాష మాట్లాడ్తది, అప్‌డేట్‌ కాలేదని అన్నరు. ఇంటికెళ్తే ఓడిపోయినట్లే. ఏడుపొస్తే ఏడ్చింది. సమస్యలొస్తే ఎదుర్కొన్నది. ఎవ్వరికీ చెప్పుకోలేదు. అవకాశాలను ఒడిసిపట్టుకొని ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్‌ అంబాసిడరై ఇప్పుడు జోర్దార్‌గా ఉన్నది. తెలంగాణ శకుంతల చెల్లెలా అనిపిస్తూ, కయ్యకయ్య మొత్తుకుంటూనే కమ్మని పదాలతో శనార్తులంటూ పలకరిస్తున్నది సుజాత.

Jordar Sujatha

నా అసలు పేరు శృతి. మాది వరంగల్‌ జిల్లా చెన్నారావ్‌ పేట మండలం ఉప్పర్‌పల్లి. మేం ముగ్గురు అక్కాచెల్లెండ్లం. నాన్న పేరు మోహన్‌రాజు. ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్‌ డ్రైవర్‌. అమ్మ అంగన్‌వాడీ టీచర్‌. అక్కలిద్దరికీ ఇంటరైపోంగనే పెండ్లిళ్లు చేసిండ్రు. ఇంటర్‌జేపిచ్చి నాకూ పెండ్లిజేసెయ్యాల్నని మావోళ్ల ఆలోచన. ‘ఇప్పుడే పెండ్లొద్దు చదువుకుంటా’ అని ఒప్పించిన. పోలీసు నౌకరీ కొట్టాలనేది నా లక్ష్యం. ఒకసారి ట్రై చేసిన. రిటన్‌ టెస్ట్‌లో పోయింది. ‘మల్లొకసారి ట్రై చేస్తా. ఆలోపు ఇంకేదైనా పనిచేస్తా’ అని ఇంట్లో చెప్పిన. సెకెండియర్‌ చదువుతున్నప్పుడు నర్సంపేటలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసిన. నా తొలి జీతం రూ.2500. అప్పుడే, నామీద నాకు కొంత నమ్మకం కలిగింది. మడికొండ మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణ క్లాసులు నడుస్తుంటే అక్కడ చేరిన. కుట్టు మిషన్‌, కంప్యూటర్‌, నర్స్‌ ట్రెయినింగ్‌ వంటి కోర్సులు ఉంటయక్కడ. డిగ్రీ అయిపోయే నాటికి కంప్యూటర్‌ కోర్సు చేసినా. మా ఇంటిపక్క అన్నలు ‘కంప్యూటర్‌ నేర్సుకున్నవ్‌ కదా! ఇంట్లనే ఉంటే ఎట్లా? హైదరాబాద్‌ వస్తే మస్తు అవకాశాలు ఉంటయ్‌. మేమే ఏదైనా కొలువులో పెట్టిస్తం రా’ అన్నరు. ‘వద్దురా’ అని అమ్మానాన్న అంటే.. ‘లేదు. నేను నౌకరీ కొట్టే మల్లా ఊర్లో అడుగు పెడతా’ అని షెర్తుగట్టి హైదరాబాద్‌ వచ్చిన. ఆ అన్నలు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో పెట్టించిండ్రు. మూడు నాలుగు నెలలు అక్కడే చేసిన. కొంత గందరగోళమే అనిపించింది. డిగ్రీ చదివినా, కంప్యూటర్‌ కోర్సు చేసినా నా మాటతీరు మారలే. పాష్‌గా మాట్లాడుడు అబ్బలే. ‘ఇదేం భాష. ఊరు భాష!’ అని వాళ్లూ వీళ్లూ ఎక్కిరిస్తుండె. బాధనిపించేది. ఇంటికిపోతే ఓడిపోయినట్లే అని ఇక్కడే ఉన్నా. ‘టీవీలల్ల తెలంగాణ భాషకు మస్తు ప్రయారిటీ ఇస్తుండ్రు. అక్కడ ట్రై చెయ్‌’ అన్నారు తెలిసినోళ్లు.

- Advertisement -

‘ఎవరి కిస్మత్‌ ఎట్లుంటదో ఓసారైతే ట్రైచేద్దాం’ అనుకున్న. ఓ చానల్‌ ఆఫీసుకుబోయి, ‘సార్‌! తెలంగాణ భాషల మంచిగ మాట్లాడ్త. అవకాశముంటే సూడుండ్రి’ అని అడిగినా. అప్పటికప్పుడు ఒక స్క్రిప్ట్‌ ఇచ్చి చదువమన్నరు. నా ైస్టెల్‌లో చదివిన. ‘మంచిగనే చెప్తున్నవ్‌. ఇంకొంచెం నేర్చుకోవాల్సి ఉంటది’ అని చెప్పి తీస్కుండ్రు.

Jordar Sujatha

సుజాతగా మారిన

నేను టీవీల నౌకరీ కోసం ట్రై చేస్తున్నానని అమ్మానాన్నకు తెల్వదు. ట్రెయినీగా ప్రజెంటేషన్‌తో పాటు స్క్రిప్ట్‌ రైటింగ్‌, వాయిస్‌ ఓవర్‌ నేర్సుకున్నా. స్క్రీన్‌మీద కన్పించినంక ఇంటికాన్నుంచి అమ్మ ఫోన్‌జేసింది. ‘టీవీల కన్పిస్తున్నది నువ్వేనా? కంప్యూటర్‌ జాబ్‌ చేస్తున్నా అని చెప్పినవ్‌?’ అని ఆశ్చర్యంగా అడిగింది. ‘నేను పెట్టిన పేరు తీసేసి సుజాత అని పెట్టుకున్నవేంది బిడ్డా’ అన్నదొకసారి. ‘పల్లెటూరి అమ్మాయిగా ప్రజలు నా క్యారెక్టర్‌ను ఓన్‌ చేసుకోవాల్నంటే ఊళ్లలో, నోళ్లలో నానే పేరైతేనే బాగుంటదని మార్చుకున్నా’ అని చెప్పిన. నా జీవమంతా భాషలోనే ఉందనుకుంటున్నా. నాకు భాషతో మంచి పేరొచ్చింది. గుర్తింపొచ్చింది. అందుకే, భాషపై ఇంకా స్టడీ చేస్తున్నా. సాన పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటా.

బిగ్‌బాస్‌లో అవకాశం

హెచ్‌ఎం టీవీ ‘జోర్దార్‌ సుజాత’ నన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. మొదట్నుంచీ యాజమాన్యం నన్ను ప్రోత్సహిస్తున్నది. బిగ్‌బాస్‌ ఆఫరొచ్చినప్పుడు కూడా వెళ్లమని చెప్పింది. ‘సార్‌! నాకొక అవకాశం వచ్చింది. అది నా భాషకు, మన ప్రోగ్రామ్‌కు హెల్ప్‌ అవుతుంది’ అంటే, ‘వెళ్లు’ అని చెప్పిండ్రు. బిగ్‌బాస్‌ అవకాశం అనేది నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్‌ చేయలే. ఊరొదిలి, అమ్మానాన్నకు దూరంగా ఉంటున్నగానీ, నా ప్రాణమంతా వాళ్లమీదనే ఉండేది. రోజూ ఐదారుసార్లు వీడియో కాల్‌లో మాట్లాడేదాన్ని. అసొంటిది బిగ్‌బాస్‌కెళ్తే ఎట్లా మాట్లాడాలి? అనిపించింది. ‘మేం నిన్ను టీవీలో చూస్తం. నువ్వేమీ రందివెట్టుకోకు. మంచిగ తిని.. మంచిగ ఆడు’ అని వాళ్లు సపోర్ట్‌ చేసిండ్రు. బిగ్‌బాస్‌ నుంచి బైటికొచ్చిన తర్వాత మాటీవీ వాళ్లు ‘ఆహారం-ఆరోగ్యం’ అనే ప్రోగ్రామ్‌ ఇచ్చిండ్రు. ‘జోర్దార్‌ సుజాత’ ఇంకింత జోష్‌తో నడుస్తున్నది.

శకుంతల చెల్లెనంట

ఇన్నొద్దులు సోషల్‌ మీడియాపై ఆసక్తి లేకుండె. ఇప్పుడు సోషల్‌ మీడియా ఇంపార్టెన్స్‌ ఏందో తెలిసింది. నన్ను నేను ఇంకా కొత్తగా ఎలా చూపించుకోగలుగుతా, ప్రజలకు ఇంకా ఎలా దగ్గర అవుతా.. అనుకున్నప్పుడు నాకు దొరికిన ఆప్షన్‌ యూట్యూబ్‌. సొంతంగా నేనొక చానెల్‌ పెట్టుకుంటే నా ఆలోచనల్నీ షేర్‌ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే ‘సూపర్‌ సుజాత’ చానల్‌ పెట్టుకున్నా. సినిమాలకు కూడా అడుగుతుండ్రు. సిస్టర్‌ రోల్స్‌, ఫ్రెండ్‌ రోల్స్‌ చాలానే వస్తున్నయి. ఇంకేదీ ఫైనల్‌ చేయలేదు. మనమేదైనా చేస్తే టర్నింగ్‌ పాయింట్‌ లెక్క ఉండాలెగనీ, ఏదో చేస్తున్నవా అంటే చేస్తున్న అన్నట్లుగా ఉండొద్దు కదా? నా గొంతు, మాటతీరు, బెదిరిచ్చుడు అంతా చూసి ‘తెలంగాణ శకుంతల చెల్లె లెక్కున్నవ్‌. ఆమె స్థానాన్ని భర్తీ చేస్తవ్‌’ అంటున్నరు. అసొంటి అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకుంటా.

అప్పుడెప్పుడో ఇంటర్‌ల ‘పెండ్లి చేస్కుంటవా’ అని అడిగిన అమ్మ ఇప్పుడు, ఆ మాటే అనడం లేదు. నా నిర్ణయానికే వదిలేసిండ్రు. నేను కూడా వాళ్లకు ‘మీరు చూపించిన వాడినే చేసుకుంటా. కానీ ఎప్పుడు అనేది నేనే చెప్తా’ అని చెప్పిన. ఇప్పుడే కెరీర్‌ బిల్డప్‌ అవుతున్నది కదా. నేను సంవత్సరంలో మూడ్రోజులు.. బతుకమ్మకు మాత్రమే ఊరికి వెళ్తా. ఆ మూడ్రోజుల తర్వాత ఊరొదిలి వస్తుంటే కండ్లపొంటి నీళ్లొస్తయి. ఊరంటే, నా తల్లిదండ్రులంటే నాకు అంత ప్రేమ.

– దాయి శ్రీశైలం

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

తెలంగాణ భాషా దినోత్సవం | ఈ కథ వింటే కాళోజీ దృక్పథం ఎంత సునిశితమైనదో తెలుస్తుంది…

తెలంగాణ భాషా దినోత్సవం | తెలంగాణ భాష పట్ల ఆంధ్రావారి వెక్కిరింతలకు కారణం ఏమిటి?

Bald Fest : అక్క‌డికి బ‌ట్ట‌త‌ల ఉంటేనే ఎంట్రీ.. బ‌ట్ట‌త‌ల ఫెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement