తెలంగాణ భాషా దినోత్సవం | తెలంగాణ కవులు, రచయితలంతా మన భాష, యాసలోనే రచనలు కొనసాగించడం వల్ల తెలంగాణ భాషావికాసం సాధ్యమవుతుందని ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భాషా గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నదని చెప్పారు. తెలంగాణ భాషాదినోత్సవంగా సందర్భంగా ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
తెలంగాణ ప్రజల జీవన వెతలు ఎంతటి దుఃఖభరితమైనవో.. అదేస్థాయిలో తెలంగాణ భాష కూడా వివక్షకు, అణచివేతకు గురైంది. ముస్లింల పాలనలో ఉర్దూ, పారసీ భాషలు అధికార భాషలుగా ఉండి తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష ఉపేక్షకు గురైంది. ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తమ భాష, యాసలకు గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలంగాణ వారు అనుకుంటే.. అది నిరాశే అయ్యింది. ఉమ్మడి పాలనలో మధ్యాంధ్రప్రదేశ్ వారి వెక్కిరింపులకు తెలంగాణ భాష గురైంది. ఆంధ్రావారు తమిళ భాషా ప్రభావానికి గురై తమ భాష తీయదనాన్ని తిక్కనాది కవులు ప్రయోగించిన అచ్చమైన తెలుగు భాషా సౌందర్యాన్ని మర్చిపోయారు, కోల్పోయారు.
అచ్చమైన తెలుగు భాష అయిన తెలంగాణ భాష ఆంధ్రావారికి వింతగా అనిపించింది. వెనుకబడినదిగా తోచింది. దీంతో వారు వెక్కిరింతలకు పాల్పడ్డారు. ఇలా వెక్కిరింతలకు గురైన తెలంగాణ ప్రజలు తమ భాష మీద గౌరవంతో, అభిమానంతో ప్రత్యేక రాష్ర్టాన్ని కోరుకున్నారు. అది ఫలించింది.
ప్రజాకవి కాళోజీ జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించడం ఎంతో సముచితం. జీవితాంతం తెలంగాణ భాష, యాసలకు పట్టం కట్టి మాట్లాడినా.., రాసి నా.. తెలంగాణ భాష ఉన్నతిని చాటిన కవి కాళోజీ. ఆయన కృషి, ఆరాటం ఫలించి ఇప్పుడు తెలంగాణ భాష సాహిత్యభాషగా మారి, కావ్య గౌరవాన్ని పొందుతున్నది. తెలంగాణ ప్రభు త్వం కూడా తెలంగాణ భాషాదినోత్సవాన్ని నిర్వహించటం తెలంగాణ భాషా గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నది.
కవులు, రచయితలు తెలంగాణ భాషలో రచనలు చేస్తున్నా రు. పాలకులు కూడా తెలంగాణ భాష, యాసల్లో మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలు తమ తల్లి భాషను నిర్భయంగా మాట్లాడుతున్నారు. న్యూనతను వీడి తెలంగాణ భాష, యాస కు పట్టం కడుతున్నారు. రచయితలు, కవులంతా స్థానిక తెలంగాణ భాష, యాసల్లోనే తమ రచనలు చేయటం ద్వారా తెలంగాణ భాషకు దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు పెంచాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తెలంగాణ భాషా దినోత్సవం | ఈ కథ వింటే కాళోజీ దృక్పథం ఎంత సునిశితమైనదో తెలుస్తుంది…
తెలంగాణ భాషా దినోత్సవం | ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్ అంబాసిడరైంది..
Bald Fest : అక్కడికి బట్టతల ఉంటేనే ఎంట్రీ.. బట్టతల ఫెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే?