పెరటి తోటల్లో విరబూసే రంగుల పువ్వులతో ఇంటికి కొత్త అందం వస్తుంది. మరి, వాటిపై సీతాకోకచిలుకలూ వచ్చి వాలితే.. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాబట్టి, మానసిక ఆనందం సొంతం కావాలంటే.. ఇంటికి మాత్రమే కాదు, తోటల్లోకీ అతిథులను ఆహ్వానించాలి. ఇందుకోసం నిపుణులు చెబుతున్న సలహాలు పాటించాలి.
పెరటి తోటల్లో సీతాకోకచిలుకలకు అనుకూలమైన మొక్కలను పెంచాలి. వాటికి ఎండ ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. ఎందుకంటే.. సీతాకోకచిలుకలు వెచ్చని, ప్రకాశవంతమైన వాతావరణాన్నే ఇష్టపడతాయి. వీటి రక్తం చల్లగా ఉంటుంది. కాబట్టి, ఇవి ఎక్కువగా ఎండ ఉన్న ప్రాంతాల్లోనే ఆహారం తీసుకోడానికి ఆసక్తి చూపుతాయి. కాబట్టి, పూల మొక్కల కుండీలను ఉదయం, సాయంత్రం వేళల్లో లేత ఎండ పడే ప్రాంతంలో ఉంచండి.
వాటి దాహం తీరడానికి తోటలో అక్కడక్కడా నీటితో నింపిన కుండీలను ఏర్పాటుచేయండి. ఇక మీరు ఎన్ని పూలమొక్కల్ని పెంచినా.. పురుగుమందు వాసన వస్తే, సీతాకోకచిలుకలు అటువైపు కన్నెత్తి కూడా చూడవు. కాబట్టి, ఘాటు వాసనలు వేసే పురుగు మందులను వాడకండి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. కలుపు తీయక పోయినా, రాత్రిపూట కృత్రిమ కాంతి (విద్యుత్ దీపాలు) ఉన్నా.. ఆ తోటలోకి వచ్చేందుకు సీతాకోకచిలుకలు ఆసక్తి చూపించవు.