ఏఐ… ఇప్పుడు ఇదేట్రెండు. కానీ దాన్ని మించిన మరో ట్రెండుకు శ్రీకారం చుట్టింది ఐరోపా దేశమైన అల్బేనియా. తన మంత్రిత్వ శాఖల్లో ముఖ్యమైన పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ డిపార్ట్మెంట్కి ఏఐ ఆధారిత అసిస్టెంట్ డయెల్లాను ప్రపంచంలోనే తొలిసారి క్యాబినెట్ మినిస్టర్‌గా నియమించింది.
దేశానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు ఎవరికి అప్పగించాలన్నది ఇక ఈ మంత్రిగారే చూడనున్నారట. తమ దేశంలోని అవినీతిని అరికట్టి, ఐరోపా సమాఖ్యలో భాగం కావాలన్న ఆశతో ఈ వినూత్న ప్రయత్నం చేసిందట అక్కడి ప్రభుత్వం. దేశ ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఏఐ తమకు ఓ మంచి మార్గంగా కనిపించిందంటున్న అల్బేనియా నిర్ణయం కనుక విజయవంతమైతే.. ప్రపంచ రాజకీయాల్లో ఇది ఓ సంచలనమే కానుంది.
మిషన్ ఇక్కడ.. ఇది అబద్ధం చెప్పదు… ఓ హిట్ సినిమా డైలాగ్. అక్కడ సీన్ చూసేందుకు కామెడీగా ఉన్నా మనిషి నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అన్న విషయాన్ని మిషన్ ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మనిషి నిజాయతీని, విషయంలోని కచ్చితత్వాన్ని యంత్రాలే అంచనా వేసి చెప్పే రోజులు వచ్చేశాయి. వాటిని మించి అనేక అంశాల్లో సమర్థంగా పనిచేస్తున్నది ఏఐ… అదే కృత్రిమ మేధ. ఇంత సాంకేతిక అభివృద్ధిని ఓ దేశం ప్రయోజనాల కోసం ఎందుకు వాడుకోకూడదన్న ఆలోచనే డయెల్లాను మినిస్టర్‌ని చేసింది. అయితే ఇది ఆమెకు ప్రమోషన్ అనే చెప్పాలి. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం కోసం సమర్థంగా పనిచేయడం వల్లే ఈ హోదాను ఇచ్చారు.
ఐరోపా దేశమైన అల్బేనియా యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందాలని ప్రయత్నం చేస్తున్నది. అయితే అందులో చేరేందుకు ఒక దేశానికి ఉండాల్సిన ప్రధాన లక్షణం తక్కువ అవినీతి. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకే ఈ ప్రయత్నం.
ప్రజాధనం వినియోగం విషయంలో అవినీతికి అవకాశాన్ని తగ్గించడం, తద్వారా పారదర్శకత పెంచడం. టెండర్లలాంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రక్రియలో మనుషుల జోక్యాన్ని తగ్గించడం. తద్వారా మానవ పక్షపాత ధోరణి తగ్గించి, ఆర్థిక లావాదేవీలు న్యాయబద్ధంగా జరిగే అవకాశాన్ని మెరుగుపరచడం.