వయసుకొచ్చిన నలుగురు చెల్లెళ్లకు పెండ్లి చేయడానికి ఓ మధ్యతరగతి అన్నయ్యపడే కష్టాలు, చిలిపి చెల్లెళ్లతో ముదురు అన్నయ్య సరదా సన్నివేశాలు ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేస్తాయి. సగటు మనిషి జీవితంలోని అనేకానేక ఉద్వేగాల సమాహారమే.. ‘రక్షాబంధన్’ సినిమా.
‘వరకట్నం’ అనేది పేద, మధ్య తరగతి జీవితాలను ఎలా తలకిందులు చేస్తుంది? అనే విషయాన్ని చక్కగా చూపించారు దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. తోబుట్టువులకు భర్తలను వెతికే క్రమంలో అన్నపడే కష్టాలను హృద్యంగా తెరకెక్కించారు. మధ్యలో, చెల్లెళ్ల పెండ్లి తర్వాతే.. తాను ఓ ఇంటివాడిని అవుతానంటూ హీరో చేసే భీష్మ ప్రతిజ్ఞ ఒకటి. ఆ బాధ్యతలో భాగంగా కిడ్నీలు, గుండె దానం చేయడానికి కూడా సిద్ధపడతాడు కథా నాయకుడు. రాఖీ పండుగకు ఒకరోజు ముందు విడుదలైన ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. పేద అన్నయ్యగా అక్షయ్‌కుమార్ మెప్పించారు. భూమి పడ్నేకర్, సాదియా ఖతీజ్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.