‘టౌను పక్కకెళ్లొద్దురో’ అనే పాట అప్పుడెప్పుడో వచ్చింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే హెచ్చరిక చేస్తున్నది. వాయు కాలుష్యం ఉన్న ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపితే డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వస్తుందని చెబుతున్నది. డబ్ల్యూహెచ్వో ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రతి ఏటా పది లక్షల మంది డిమెన్షియాకు గురువుతున్నారు. వీటిలో చికిత్స ద్వారా తగ్గించగలిగే డిమెన్షియాల జాబితాలో వాయు కాలుష్యం కారణంగా డిమెన్షియా బారినపడ్డ బాధితులు కూడా చేరారు. ఇంతకు ముందు పొగ తాగడం, అధిక రక్త పీడనం, మద్యపానం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ఒత్తిడి, కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల మతిమరుపు పలకరించేది. తాజాగా అధిక కాలుష్య వాతావరణంలో ఉండేవాళ్లనూ డిమెన్షియా వదలనంటున్నదని తేలింది.
పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల కారణంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి తప్పించుకునేందుకు పారిశ్రామికవాడలకు దూరంగా, వాయు కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేందుకు ప్రాధాన్యమివ్వాలి. దీనికంటే ముందు 2024లో భారతీయుల్లో జరిపిన అధ్యయనాల్లో డిమెన్షియా బాధితుల్లో 45 శాతం మంది వాతావరణ కాలుష్యం కారణంగానే ఈ వ్యాధి బారినపడినట్టు లాన్సెట్ ప్రచురించింది. పెద్ద పెద్ద పారిశ్రామికవాడలే కాదు ఇళ్లల్లో ఉండే కాలుష్యం మూలంగానూ డిమెన్షియా ప్రమాదం పొంచి ఉందని అధ్యయనంలో గుర్తించారు. కాబట్టి వాయు కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అధికంగా వాయు కాలుష్యంలో ఉండేవాళ్లు వ్యాయామం, ప్రాణాయామం, పోషకాహారం తీసుకుంటే డిమెన్షియా రాకుండా కొంతవరకు నియంత్రించవచ్చు.