కొన్ని స్నేహాలు కాలేజీలో చిగురిస్తే, మరికొన్ని కెరీర్ దారిలో విరబూస్తాయి. ఓ సినిమా కారణంగా హీరోయిన్ తాప్సీ పన్ను, క్రికెటర్ మిథాలీరాజ్ మధ్య అందమైన స్నేహ బంధం వికసించింది. మిథాలి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ‘శభాష్ మిథూ’ షూటింగ్ సమయంలో వీరిద్దరూ జిగిరీ దోస్తులు అయ్యారు. ఒకరి గురించి ఒకరు ఏం చెబుతున్నారో చూద్దాం..
మిథాలీరాజ్‌లో నచ్చినవి
తాప్సీ: క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే దేశం భారత్. అయితే, జనం క్రికెట్‌ను ఇష్టపడతారా?! లేదా మగవాళ్ల క్రికెట్‌ను మాత్రమే ఇష్టపడతారా? అనే సందేహం నన్నెప్పుడూ వెంటాడేది. మిథాలీని చూశాక.. ఈ రంగానికి ఇదే కొలమానం… అని ఏమీ ఉండదనిపించింది. దాదాపు 20 ఏండ్లు భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసింది తను. ఇది నిజంగా ఎంత గొప్పో. సమాజానికి ఇది నచ్చుతుందా అని కాకుండా, నాకు చేతనయిన పని ద్వారా సమాజానికి ఎంత కంట్రిబ్యూట్ చేయగలను అని మాత్రమే ఆలోచించింది. ఆ ఆలోచనా విధానం నన్ను ఆకట్టుకుంది. ఇవాళ ఆమెను చూసి చాలా మంది ఆడపిల్లలు క్రికెట్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి మహిళకూ తన ఆలోచనా విధానం ఆదర్శం.
తాప్సీలో ఇష్టమైనవి
మిథాలి: తాప్సీ ఎంపిక విభిన్నంగా ఉంటుంది. నామ్ షబానా, పింక్‌లాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు ఆ పాత్రల్లో ఆమె ఎంత లీనమైపోయిందో ఇట్టే అర్థమవుతుంది. ఇక, ప్రాజెక్టు ఒప్పుకొంటే ఒక్క చేతిమీద నడిపించగలిగే సత్తా ఉన్న అమ్మాయి తను. సినిమాల విషయంలో ఇంత సీరియస్‌గా ఉండే మనిషి అయినా.. బయట మాత్రం పూర్తిగా వేరు. ఎంతో ప్రేమగా మెలుగుతుంది. ఆత్మీయంగా మాట్లాడుతుంది. సినిమా చేసేప్పుడు మా మ్యాచుల్ని బాగా ఫాలో అయ్యేది. ఎప్పుడయినా ఓడిపోతే.. ‘బాధపడకండి బాగా ఆడారు, ఈ సారి విజయం మీదే..’ అంటూ సందేశాలు పంపేది.
మిథాలి నుంచి నేర్చుకున్నా
తాప్సీ: మన పనే మన గురించి మాట్లాడేలా చేయాలి తప్ప, మన గురించి మనం పబ్లిసిటీ చేసుకోనక్కర్లేదు.. అన్న విషయం మిథాలి నుంచి నేర్చుకున్నాను. అతిపిన్న వయసులో భారత క్రికెట్ జట్టుకు నేతృత్వం వహించడం మొదలు ఇండియా అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్త్న్ర అందుకునే దాకా ఆమె అధిగమించిన మైలురాళ్లు ఎన్నో. అయినా సరే వార్తల్లో నిలవడం కోసం ఎప్పుడూ కాంట్రవర్సీల జోలికి వెళ్లలేదు. తన గురించి ఎక్కడన్నా ఏదన్నా రాశారూ అంటే, అది ఆమె విజయాల గురించి మాత్రమే. క్రీడాకారిణి అంటే తనలా ఉండాలి. ఓ స్నేహితురాలు అంటే కూడా తనలానే ఉండాలి. ఇలా రెండు రకాలుగా మిథాలి నా మనసును గెలిచింది.
అచ్చంగా ఆపోజిట్
మిథాలి: స్వభావ రీత్యా మేమిద్దరం పూర్తి వ్యతిరేకమైన వ్యక్తులం. నేను ఇంట్రావర్ట్‌ని. ఆమె ఎక్స్ట్రావర్ట్. మంచి ఎనర్జిటిక్ పర్సన్.
ఇద్దరం సేమ్ టు సేమ్
తాప్సీ: ఒకసారి ప్రెస్మీట్లో ‘పురుషుల క్రికెట్ జట్టులో మీ అభిమాన క్రికెటర్ ఎవరు?’ అని మిథాలీని అడిగారు. ‘మీరు ఇదే ప్రశ్న పురుషుల టీమ్‌నూ అడుగుతారా?!’ అని సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో మా ఇద్దరి ఆలోచనా ఒకేలా ఉంటుంది.