ప్రతి మహిళ జీవితంలో ఆ తొమ్మిది నెలలూ కీలకమైనవి. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా.. ఏవో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా, డిప్రెషన్ లక్షణాలు ఆ తల్లిని చికాకు పరుస్తాయి. ప్రసవానంతర డిప్రెషన్ తననూ ఇబ్బంది పెట్టిందని నటి కాజల్ తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ‘ఇలాంటి సమయంలో అమ్మ, నాన్న, తోబుట్టువులు, జీవిత భాగస్వామి, స్నేహితుల మద్దతు చాలా అవసరం. వాళ్లంతా ఆ మహిళ కోసం రోజూ కొంత సమయం కేటాయించాలి.
ఆమె కూడా నాలుగు గోడలకే పరిమితం కాకుండా.. గడపదాటి నాలుగడుగులు వేయాలి. ఆత్మీయులతో కబుర్లు చెప్పుకోవాలి. నేస్తాలతో మాట్లాడటమూ ఓ థెరపీ లాంటిదే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నేను కూడా డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ సంక్షోభ సమయంలో ఫ్యామిలీ అండగా నిలిచింది. అందులోనూ మావారి ఓపికకు దండం పెట్టాలి. కాబట్టే, నేను చాలా త్వరగా ఆ దశ నుంచి బయటపడ్డాను. అందరికీ నా లాంటి అదృష్టమే దక్కాలని కోరుకుంటున్నా’.. అంటూ ఉద్వేగంగా పోస్టు పెట్టారు కాజల్.