గ్రామీణ మహిళలను కుటుంబ వ్యవహారాలకే పరిమితం చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి, భద్రత తదితర అంశాలు వారి పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. ఈ క్రమంలో పల్లె మహిళలకు చేయూతనివ్వడం ద్వారా దేశానికి ఆర్థిక బలాన్ని అందించవచ్చని ఓ సర్వే వెల్లడించింది.
మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, బైన్ అండ్ కో సంస్థలు ‘ఫ్రమ్ యాస్పిరేషన్ టు యాక్షన్’ పేరుతో ఓ అధ్యయనం చేపట్టాయి. ఇందులో గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని తేలింది. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం, నైపుణ్యాలు, సరైన మార్గదర్శకత్వం, వారి ఉత్పత్తులకు మార్కెట్‌ను అనుసంధానించడం, మూలధనం కోసం ఆర్థికసాయం చేయడం, పిల్లల సంరక్షణకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు. సర్వేలో చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్య రేటు 35 నుంచి 40 శాతం మాత్రమే ఉంది! పల్లె మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తే.. 2047 నాటికి వారి భాగస్వామ్యం 70 శాతానికి పెరిగే అవకాశం ఉన్నదని సర్వే సారాంశం.
అనుకూలమైన జనాభా, సహాయక విధానాలు ఉన్నప్పటికీ.. మనదేశంలో కేవలం 11 కోట్ల మంది మహిళలు మాత్రమే డబ్బును ఆర్జించే పనులు చేస్తున్నారట. వారికి చేయూత అందించడం ద్వారా 2047 నాటికి 45 శాతం అంటే.. 25.5 కోట్ల మంది మహిళలకు లబ్ధిచేకూరుతుందని అధ్యయనకారుల అంచనా! ఫలితంగా.. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన అభివృద్ధి సాధిస్తుంది. 2047 వరకు భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల వాటా యాభై శాతానికి పెరుగుతుందని సర్వే ప్రతినిధులు పేర్కొంటున్నారు.