మారథాన్లలో పాల్గొనడం కొందరికి మంచి కిక్‌ని ఇస్తుంది. ఏడాదికోసారో రెండుసార్లో ఇలాపరుగు తీసినా ఎంతో సాధించిన అనుభూతి కలుగుతుంది. కానీ ప్రతి రోజూ ఇదే విధంగా 42 కిలో మీటర్లకు పైగా పరిగెత్తమంటే…ఎవరైనా అమ్మో! అనే అంటారు.2024 సంవత్సరంలో నిత్యం ఒక మారథాన్‌ను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది 55 ఏండ్ల హిల్డె డొసాగ్నె. 366 రోజుల్లో 15,000 కిలోమీటర్లకు పైగా దూరం పరిగెత్తి పరుగు బాటలో బావుటాను ఎగురవేసిన ఈమె ఎందరికో స్ఫూర్తి.
మంచి చేయడం కోసం ఎంత కష్టమైన పనినైనా చేసేందుకు వెనకాడరు కొందరు. అదే కోవకు చెందుతారు బెల్జియం దేశానికి చెందిన హిల్డె డొసాగ్నె. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పరిశోధనలకు నిధుల సేకరణ కోసం ఆమె పోయిన ఏడాది మొత్తం మారథాన్ చేశారు. ఒకసారి 42.195 కిలో మీటర్లు పరిగెడితే దాన్ని మారథాన్‌గా చెబుతాం. కచ్చితత్వం కోసం ఆమె ప్రతి రోజూ 42.5 కిలోమీటర్లు పరిగెత్తేవారు. ప్రతి రోజూ నిద్ర లేవడం అన్ని కిలోమీటర్లు పరుగు తీయడం, ఇంటిపని పూర్తి చేసుకోవడం, కుటుంబ పోషణ కోసం ఉద్యోగానికి వెళ్లి రావడం… ఇదీ ఆమె దినచర్య. 55 ఏండ్ల వయసులో అయిదుగురు సభ్యులున్న కుటుంబాన్ని చూసుకోవడమే పెద్ద కసరత్తులా ఉంటుంది ఎవరికైనా.
అలాంటిది, ఓ పక్క సంపాదిస్తూ కూడా ఇన్ని గంటలు శ్రమ పడటం అన్నది అందరికీ సాధ్యమయ్యే పని కానేకాదు. కానీ సమాజానికి సేవ చేయాలన్న ఆమె సంకల్పం వయసును, బాధ్యతలను లెక్కచేయలేదు. నిజానికి గతేడాది మే 30వ తారీఖుకే ప్రపంచంలోనే వరుసగా 150 రోజులు మారథాన్ చేసిన వ్యక్తిగా గత రికార్డును బద్దలుకొట్టారామె. అయినా సరే, పరుగు ఆపకుండా 366 రోజుల పాటు వరుస మారథాన్లను పూర్తిచేశారు. విపరీతమైన కీళ్లనొప్పులు, ఎముకలు కొరికే చలి, ఎర్రటి ఎండ… దేన్నీ ఆమె లెక్క చేయలేదు. పోషకాహార నిపుణుల సాయంతో ఆమె తన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేశారు. అయితే మానసికంగానూ ఇది తనను ఒత్తిడికి గురి చేసిందని చెబుతారామె. ప్రతి రోజూ నిద్రలేచి, మళ్లీ స్టార్ట్ అనే తొలి గీత దగ్గర నిలవడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే అంటారు. నిజానికి ఆమె అంతకు మునుపే గ్రీస్‌లో జరిగిన 246 కిలోమీటర్ల స్పార్టథ్లాన్ను వరుసగా రెండేండ్లు పూర్తిచేశారు. దీంతో వరుసగా ప్రతి రోజూ పరిగెత్తేందుకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేకపోయింది. అయినా సరే, మారే కాలాలను లెక్క చేయకుండా రోజుకు నాలుగు గంటల పాటు పరుగు సాగించడం నిజంగా సవాలుతో కూడుకున్న విషయమే.
20
‘నేను ఈ ఏడాదిలో శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు కింద పడిపోయి దేకుతూ వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. అందులోనూ మరీ కష్టమైన సంఘటన ఒకటి ఉంది. ఒకరోజు 25 కిలోమీటర్లు పరిగెత్తాక కిందపడిపోయాను. నా కాలికి గాయం అయింది. వేలు విరిగి పోయిందేమో అనుకున్నా. డాక్టర్ దగ్గరికి వెళితే చికిత్స చేశారు. తర్వాత మళ్లీ షూ వేసుకుని తొలి అడుగు నుంచి మారథాన్ ప్రారంభించి పూర్తి చేశా. అంటే ఆ రోజు నేను మొత్తంగా 69 కిలోమీటర్లు పరిగెత్తా. అలా కాకపోతే నేను అనుకున్న ఏడాది మారథాన్‌ను పూర్తి చేయలేనేమో అని భయం వేసింది’ అని చెబుతారామె. తన కఠోర శ్రమతో ఆమె రొమ్ము క్యాన్సర్ పరిశోధనల కోసం సుమారు 60 లక్షల రూపాయల్ని పోగు చేయగలిగారు. హిల్డె గురించి తెలిసిన ఎవరైనా ఆమె సంకల్ప బలానికి సలాం కొట్టాల్సిందే మరి!