e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిందగీ త్రీ ‘వేదాస్‌'!

త్రీ ‘వేదాస్‌’!

త్రీ ‘వేదాస్‌'!

ముగ్గురు భాగస్వాములు.. సుధ, సంధ్య, దుర్గ. మూడు లక్ష్యాలు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం. ఘుమఘుమలు మాత్రం అనేకం.. పచ్చళ్లనుంచి పొడులవరకూ! ‘వేదాస్‌’బ్రాండ్‌తో ముగ్గురు మహిళలు ప్రారంభించిన రుచుల వ్యాపారం కొవిడ్‌ అవరోధాలను తట్టుకొని నిలుస్తున్నది, గెలుస్తున్నది.

పచ్చళ్ల సీజన్‌లో మస్తు పని. వేలిపై వేటు పడకుండా ముక్కలు కొడుతూ ఒకరు, ఆ ముక్కలను ఏరుతూ ఒకరు. ఎల్లిపాయలు వొలుస్తూ పెద్దమ్మ, అల్లం పొట్టు తీస్తూ చిన్నమ్మ, కొలతల ప్రకారం ఉప్పూకారాలూ కలుపుతూ అమ్మమ్మ! ఏడాదంతా ఇంటిల్లిపాది నోటికి కమ్మని రుచిని అందించే పచ్చడికోసం, వారం రోజులు కష్ట పడలేమా! కానీ, ఆ ముగ్గురికీ మాత్రం.. కస్టమర్లూ కుటుంబసభ్యులే! అందరి అభిరుచులనూ దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగుతారు. ఈ మహిళాత్రయంలో.. ప్రియసుధ కొంపెళ్ల, సంధ్య ప్రసాద్‌ అక్కాచెల్లెళ్లు. ఇంకొకరు, వాళ్లిద్దరి ఆడపడుచు కనకదుర్గ వంగీపురపు. ముగ్గురూ వ్యాపారంలో భాగస్వాములే కాదు, ప్రియమిత్రులు కూడా. ‘వేదాస్‌’ బ్రాండ్‌తో వీళ్లు సీజన్‌కి తగ్గట్లు పచ్చళ్లు, పొడులు తయారు చేస్తున్నారు. తమ రుచుల ప్రస్థానాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారు కో-ఫౌండర్‌ ప్రియసుధ కొంపెళ్ల..

తొలి అడుగు..
“నేను హౌజ్‌ వైఫ్‌ని. రోజంతా ఇంటిపనులతోనే గడిపేదాన్ని. మా చెల్లి సంధ్య యోగా టీచర్‌. మా ఆడపడుచు ఆన్‌లైన్‌లో దేశవిదేశాల విద్యార్థులకు మ్యాథ్స్‌ క్లాసులు తీసుకుంటారు. మేం బిజినెస్‌ పెట్టాలని నిర్ణయించుకోగానే అంటే, 2017నుంచీ మూడేండ్లు ఇంట్లోనే పచ్చళ్లు పెట్టి అమ్మాం. దీన్నో వ్యాపారంగా తీసుకెళ్లమని మా మామగారు సలహా ఇచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్‌ దగ్గర కూచారం అనే గ్రామంలో కొంత స్థలం కేటాయించింది. 2020 నుంచి అక్కడే పచ్చళ్లు పెట్టడం ప్రారంభించాం. మామిడికాయలు, టమాట, పండుమిర్చి, పుంటికూర, చింతకాయలను నేరుగా రైతులనుంచే కొంటాం. రకరకాల పొడులూ తయారు చేస్తాం. ఇంట్లో నలుగురికోసం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, పరిశుభ్రతతో పెడతామో… అదే పద్ధతిలోనే, కస్టమర్ల కోసం వందలకొద్దీ కాయలతో పచ్చడి పెడుతున్నాం.

ఫీడ్‌బ్యాక్‌ ముఖ్యం
మా కంపెనీ గురించి ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేదు. మౌత్‌ టాక్‌వల్ల వస్తున్న కస్టమర్లే ఎక్కువ. ఒకసారి మా పదార్థాలు రుచి చూసిన వాళ్లు, మళ్లీ మళ్లీ ఆర్డర్‌ చేస్తుంటారు. కారణం, మేం సహజ పద్ధతుల్లో పచ్చళ్లు తయారు చేస్తాం. చాలామంది మార్కెట్లో దొరికే ప్యాకెట్‌ నూనె, కారం, పసుపు వాడతారు. మాకు మాత్రం సొంతంగా గానుగ నూనె తీసే వ్యవస్థ ఉంది. పచ్చళ్లకు నువ్వుల నూనెనే వాడతాం. విదేశాలనుంచీ ఆర్డర్లు వస్తుంటాయి. కస్టమైజ్డ్‌గా కూడా తయారు చేస్తున్నాం. కొంతమంది వెల్లుల్లి అసలు వాడరు. అలాంటివాళ్లకు వెల్లుల్లి లేకుండా ఆవకాయ పెట్టిస్తాం. ప్రస్తుతం మా బ్రాండ్‌కు దాదాపు 300 మంది రెగ్యులర్‌ కస్టమర్లు ఉన్నారు. మాకు తెలిసినవే కాకుండా, ఎవరైనా కొత్త రకం పచ్చళ్లను చెప్తే వాటిని నేర్చుకుని కూడా పెడుతుంటాం.

కొవిడ్‌ నిబంధనలతో..
కరోనా వైరస్‌ ఉన్నా, లేకపోయినా పచ్చళ్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రంగా చేస్తేనే పాడవకుండా ఉంటుంది. మాతోపాటు కంపెనీలో పని చేసే ఇరవైమంది వర్కర్స్‌కూడా గ్లౌజులు, మాస్క్‌లు, హెడ్‌గేర్లు తప్పనిసరిగా వాడుతారు. శానిటైజర్‌ మా కంపెనీలోనే తయారు చేస్తున్నాం. మాకు ఖాళీ స్థలం ఎక్కువ. కాబట్టి, వీలైనంత వరకు దూరం పాటిస్తూనే పనులు చేస్తున్నాం. మేమంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం. ముచ్చట్లు పెట్టుకుంటూ, మ్యూజిక్‌ వింటూ పనులు చేస్తాం. లాక్‌డౌన్‌లో అందరిలాగే మాకూ కష్టాలూ, నష్టాలూ తప్పట్లేదు. అయినా, ‘రోజులన్నీ ఒకేలా ఉండవు కదా’ అనే నమ్మకంతో పని చేస్తున్నాం.

ముగ్గురికీ ఒక్కో ప్రత్యేకత
‘వేదాస్‌’ పనుల్లో మేం చురుగ్గా పాల్గొంటాం. సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి ముడిసరుకు తేవడం నుంచి పచ్చళ్లు, పొడులు చేసేవరకు అన్నీ దగ్గరుండి చేయిస్తాం. మా ఆడపడుచు దుర్గ పచ్చడి ప్రాసెస్‌ను బాగా పరిశీలిస్తుంది. ఏది ఎంత మోతాదులో వేయాలనే విషయంలో తను ఎక్స్‌పర్ట్‌. అలాగే, చెల్లి సంధ్య టేస్ట్‌ చెక్‌ చేయడంలో దిట్ట. ఉప్పు, కారం వంటివి కరెక్ట్‌గా చూస్తుంది. తను సర్టిఫై చేసిందంటే, ఆ పచ్చడి రుచికి తిరుగులేదని నమ్ముతాం. నా విషయానికొస్తే అడ్మినిస్ట్రేషన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ పనులు చూసుకుంటాను. ఇప్పటికి, పెద్ద స్థాయిలో లాభాలైతే గడించట్లేదు. ఆ కోరికా మాకు లేదు. స్వచ్ఛమైన, నాణ్యమైన సంప్రదాయ పచ్చళ్లు, పొడులు తయారు చేస్తూ.. నలుగురికీ మా ద్వారా ఉపాధి అందించాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త్రీ ‘వేదాస్‌'!

ట్రెండింగ్‌

Advertisement