సుబేదారి, అక్టోబర్10 : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు పల్లె రాహుల్‌రెడ్డి పోలీసుల సాక్షిగా ఓ వ్యక్తిపై దౌర్జన్యం చేశాడు. ఈ ఘటన శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హనుమకొండకు చెందిన సూర్యకిరణ్, ఆత్మకూరుకు చెందిన గౌని శ్రీకాంత్ వద్ద ఫార్చునర్ వాహనం కుదువబెట్టి రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత సూర్యకిరణ్ మరో సెల్ఫ్ డ్రైవ్ కారును కుదువబెట్టి ఫార్చునర్‌ను తీసుకెళ్లాడు.
ఆ కారు ఓనర్ శ్రీకాంత్‌పై కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కానిస్టేబుల్ శ్రీకాంత్ ఇంటికి వచ్చి నీ మీద పిటిషన్ వచ్చిందని, అతడితోపాటు కారును పీఎస్‌కు శుక్రవారం తీసుకురాగా, ఎస్సై చాంబ ర్ ముందు నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫున అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అనుచరుడు పల్లె రాహుల్‌రెడ్డి శ్రీకాంత్ వద్దకు వచ్చి ఎన్ని సార్లు పిలవాలిరా.. నేను తెల్వదార.. చంపుతా.. అంటూ రెచ్చిపోయి పిడిగుద్దులు గుద్దాడు. అవాక్కైన సిబ్బంది, ఎస్సై శ్రీకాంత్ వెంటనే వారిని ఇన్స్పెక్టర్ రవికుమార్ వద్దకు తీసుకువెళ్లారు. ఆయన సమక్షంలోనే రాహుల్‌రెడ్డి రెచ్చి పోయి బూతులు తిట్టాడు. ఇంత జరిగినా పట్టించుకోకుండా బయట కొట్టుకుంటే మాకేం సంబంధం అంటూ.. రాహుల్‌రెడ్డిని పోలీసులు రాచమర్యాదలతో అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనతో స్టేషన్‌కు వచ్చిన వారంతా షాక్‌కు గురయ్యారు. బాధితుడు శ్రీకాంత్ తరఫున వచ్చిన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానిస్టేబుల్ పిలిస్తే వచ్చాం.. రాహుల్‌రెడ్డి కొట్టినా పట్టించుకోరా.. చంపినా ఇంతేనా అని గొడవ పడ్డారు.
ఈ ఘటనపై కేయూ పోలీసులకు ఫిర్యాదు చేసినా రాహుల్రెడ్డిపై కేసు నమోదు చేయలేదని బాధితుడు శ్రీకాంత్ తెలిపాడు. పోలీసుల సాక్షిగా సీసీ కెమెరాల్లో రికార్డు అయినప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులు అతడికే సపోర్ట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.