వెంకటాపూర్, అక్టోబర్ 12 : రామప్ప ఆలయ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇక్కడ 11 రోజులుగా ‘వరల్డ్ హెరిటేజ్ వలంటీర్స్ క్యాంపెయిన్’ను ‘వర్కింగ్ ఆన్ ద ఫ్యూచర్’ అనే థీమ్‌తో నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ, ఐకోమస్ ఇండియా, కేంద్ర పురావస్తు శాఖ, ఇంటాక్ సంస్థల సహకారంతో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగించారు. 33 దేశాల్లో 74 క్యాంప్‌లను ఏర్పాటు చేయగా, దేశవ్యాప్తంగా పది చోట్ల నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎంపికైన వారసత్వ కట్టడాల గురించి ఆన్లైన్లో చరిత్ర, అర్కిటెక్ట్, సివిల్ ఇంజినీరింగ్, టూరిజం, ఆర్కియాలజీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి ఎంపికైన వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఆయా ప్రదేశాల చరిత్ర, ప్రత్యేకతలు, నిర్మాణశైలి, అప్పటి టెక్నాలజీ, సంస్కృతి, కళలు, గొప్పతనం, సంరక్షణ చర్యలు, స్థానిక జీవన విధానం, సంప్రదాయాల గురించి వివరించి వారితో తమతమ ప్రదేశాల్లో ప్రచారం చేయిస్తారు. ఈ క్యాంపెయిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహిస్తున్నారు. మన దేశంలో రామప్పలో నిర్వహించే క్యాంపెయిన్ చివరిది. నివేదికను నవంబర్ 15 వరకు యునెస్కోకు సమర్పించనున్నారు. ఈ సారి 260 మంది దరఖాస్తు చేసుకోగా 40 మంది ఎంపికయ్యారు. 14 రాష్ర్టాలకు చెందిన 35 మంది వలంటీర్లు హాజరయ్యారు.
11 రోజులుగా కార్యక్రమం
ఈ నెల 2న పాలంపేటలో కార్యక్రమం ప్రారంభమైంది. వరుసగా పది రోజుల పాటు బయో ఇంజినీరింగ్, కాకతీయుల నిర్మాణశైలి, టెక్నాలజీ, రామప్ప చరిత్ర, సంస్కృతి, పురాతన కట్టాడాలకు ఎంచుకున్న మెటీరియల్స్, దేవాలయాలు, కల్చరల్ టూరిజం, కాకతీయుల కట్టాడాల ఆర్కిటెక్చర్, వారసత్వ కట్టాడాల సివిల్ ఇంజినీరింగ్, రామప్పలోని సంప్రదాయ నృత్యం, కాకతీయుల కట్టాడాల ఏరియల్ వ్యూ, పునర్నిర్మాణం, తెలంగాణలోని కాకతీయుల కట్టడాలు, రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపులో టూరిజం శాఖ పాత్ర, వారసత్వ కట్టాడాల అభివృద్ధి, పునర్నిర్మాణాలు, బిల్డింగ్ కెపాసిటీ, పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ, కాకతీయల గొలుసుకట్టు చెరువులు, రామప్ప ప్రపంచ వారసత్వ హోదా రావడంపై ఐకోమస్ పాత్ర, ఇందుకు పురావస్తు శాఖ డైరెక్షన్ తదితర అంశాలపై తరగతులు నిర్వహించారు.
వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, పాండవుల గుట్ట, కోటగుళ్లు, మేడారం, లక్నవరాన్ని సందర్శించారు. భారతీయ నృత్యాల చరిత్ర, పేరిణి నృత్య ప్రదర్శన, కొమ్ముకోయ నృత్య ప్రదర్శనతో పాటు రోజూ ఉదయం యోగా శిక్షణ తీసుకున్నారు. త్రికూటాలయాన్ని శ్రమదానం చేసి ముస్తాబు చేశారు. నేడు ముగింపు కార్యక్రమం నిర్వహించనుండగా టూరిజం ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్య తదితరులు హాజరుకానున్నారు.
కాకతీయుల ఖ్యాతి విశ్వవ్యాప్తం కోసం..
వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ 2023 క్యాంపు భవిష్యత్తు కోసం పని అనే థీమ్‌తో నిర్వహించాం. దీని ద్వారా వలంటీర్లకు కాకతీయుల నిర్మాణశైలి, నాటి టెక్నాలజీ, నిర్మాణానికి వాడిన పరికరాలు, మెటీరియల్స్, నీటి పారుదల వ్యవస్థ, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాల విశిష్టత, నీటి నిల్వల గురించి వివరించాం. కాకతీయుల నీటిపారుద ల వ్యవస్థ నేటికీ అనుసరణీయమని, దీన్ని ప్రపంచ వ్యాప్తం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.
– శ్రీధర్‌రావు, కాకతీయ ట్రస్టు సభ్యుడు
టూరిజం హబ్‌గా ములుగు
కేయూ టూరిజం స్కాలర్ అయిన నేను గతేడాది వలంటీర్స్ శిక్షణ తీసుకున్న. ఈ సంవత్సరం వలంటీర్స్‌కు ఇన్చార్జిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ప్రచారంతో ములుగు జిల్లా టూరిజం హబ్‌గా మారనుంది.
– కొక్కుల ప్రశాంత్, కేయూ టూరిజం స్కాలర్, వలంటర్స్ కో ఆర్డినేటర్