వరంగల్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వీసీగా పనిచేసిన కేవలం 9నెలల కాలంలోనే వర్సిటీ ప్రతిష్టను డాక్టర్ నందకుమార్రెడ్డి దిగజార్చారనే ఆసక్తికర చర్చ రాష్ట్రంలో సాగుతున్నది. ఇప్పటికైనా సర్కార్ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో మంది అర్హులున్నా వారిని పక్కనపెట్టి తమవాడని ఏరికోరి తెచ్చుకుంటే అక్రమ మార్గానికి తెరలేపారని వీసీపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల బలం చూసుకొని వర్సిటీలో ఇష్టారీతిగా వ్యవహరించడమే కాకుండా తమ జీవితాలతో వీసీ చెలగాటం ఆడారని వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైద్య విద్య చరిత్రలో రికార్డు సమయంలో పీజీ పరీక్షల ఫలితాలు ఇచ్చానని గొప్పలు చెప్పుకున్న వీసీ అసలా పోస్టుకు అనర్హుడని దుయ్యబడుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ సమయంలో చోటుచేసుకున్న దారుణాలకు డాక్టర్ నందకుమార్రెడ్డి చెప్పిన ఉదంతమే సాక్ష్యంగా నిలిచిందని, పీజీ పరీక్షలు రాసిన విద్యార్థి సమాధాన పత్రాన్ని గుర్తించి వాల్యుయేటర్ సంబంధిత విద్యార్థికి చెప్పడం, ఆ విద్యార్థి తనకు న్యాయం చేయాలని వీసీని కోరడం, ఆయన సదరు విద్యార్థిని పాస్ చేయడమే కాకుండా అది నిబంధనల ప్రకారమే చేశామని బుకాయించడం దుర్మార్గమైన చర్య అని విద్యార్థులు మండిపడుతున్నారు. వీసీయే కాకుండా రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి ఇలా మొత్తం ఇందులో భాగస్వామ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రీ కౌంటింగా..రీ వాల్యుయేషనా?
ఐదుగురు విద్యార్థులు అక్రమ మార్గంలో పాస్ అయ్యారని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండడం, ఈ సమయంలోనే వీసీ పదవికి డాక్టర్ నందకుమార్రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, వీసీ రాజీనామాతో ఉత్పన్నమైన సమస్య సమసిపోలేదని, పూర్తిస్థాయి విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చాక ఎవరిపై.. ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొన్నది. అయితే, 2025 పీజీ పరీక్షల్లో మొత్తం 2123 మంది పరీక్షకు హాజరైతే వారిలో 1919 మంది పాస్ కాగా, 204 మంది ఫెయిలయ్యారు. వారిలో 155 మంది రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా ఏ ఒక్కరూ పాస్ కాలేదు. మొత్తానికి ఫెయిల్ అయిన ఒక విద్యార్థి కోరితే నిబంధనల ప్రకారమే తిరిగి మూల్యాంకనం చేసి పాస్ చేశామని పేర్కొన్న వీసీ వ్యాఖ్యల నేపథ్యంలో స్వల్పమార్కుల వ్యత్యాసంతో ఫెయిల్ అయిన విద్యార్థులు తమ జవాబు పత్రాలను తిరిగి వాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.