అవసరం ఏదైనా చేయిస్తుందంటారు. ఆ అవసరంలోంచే ఓ ఆలోచన పుట్టింది. కరోనా సోకిన తన తల్లికి రోజూ తేనె కావాల్సి వచ్చింది. కానీ మార్కెట్లో దొరికేది అతడికి నచ్చేది కాదు. స్వచ్ఛమైన తేనె కావాలంటే అంత సలువు కాదు. మరి మనమే తయారుచేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఓ వైపు స్కేటింగ్ కోచ్‌గా చేస్తూనే ఎల్ఎల్బీ చదువుతున్న ఆ యువకుడు తల్లి కోసం ‘హనీ బిజినెస్’ వైపు అడుగులేశాడు. తల్లి కోసం చేసిన ప్రయత్నంలో ఇప్పుడు వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు వరంగల్ మట్టెవాడకు చెందిన మాడిశెట్టి హర్షవర్ధన్.
హనుమకొండ చౌరస్తా, మే 25 : ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసి డబ్బులు సంపాదించాలి.. లేదంటే పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలి. ఇదీ ఇప్పటి యువతలో ఎక్కువమంది ఆలోచన. వరంగల్ మట్టెవాడకు చెందిన మాడిశెట్టి హర్షవర్ధన్ మాత్రం ఈ ఆలోచనలు దాటి ముందుకుసాగాడు. హర్షవర్ధన్ స్కేటింగ్ కోచ్. జాతీయస్థాయి క్రీడాకారుడు. స్కేటింగ్‌లో ఎన్నో పతకాలు సాధించాడు. వోక్స్పాప్ రోలర్ స్కేటింగ్ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తూనే ఎల్ఎల్బీ చదువుతూ అమ్మ చేసిన సూచనతో కొత్త రంగంలోకి దిగాడు. కష్టపడి విజయం సాధించాడు.
కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని, అదీ సేంద్రియ వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. అదే బాటలో వెళ్లి విజయం సాధించాడు. హర్షవర్ధన్ తల్లి ప్రతిభ పింగిళి డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో లెక్చరర్. 2020లో ఈమెకు కరోనా సోకింది. ప్రతిరోజూ పొద్దున నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. హర్షవర్ధన్ మార్కెట్లో తేనెను కొనుక్కొచ్చాడు. ఆ తేనె హర్షవర్ధన్‌కు నచ్చేది కాదు. స్వచ్ఛమైన తేనె కోసం ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో స్వచ్ఛమైన తేనె రుచి, నాణ్యతను గుర్తించాడు. అలాంటి తేనె ఎక్కడా లభించకపోవడంతో నాణ్యమైన తేనె తయారు చేయాలని ఆలోచించాడు. తల్లితో పాటు ఆమెలాంటి అందరికీ సహజసిద్ధమైన తేనె అందించాలని నిర్ణయించుకున్నాడు. గూగుల్‌లో, యూట్యూబ్‌లో తేనెటీగల పెంపకం గురించి వెతికాడు. తేనె ఎలా తయారవుతుందో తెలుసుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి ఏడాది పాటు తేనెటీగల పెంపకం, ఉత్పత్తిపై శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ తర్వాత తేనెటీగలు పెంచి స్వచ్ఛమైన తేనె అందించాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్‌లో తేనెటీగలు పెంచే రెండు బాక్సులను కొనుక్కొచ్చాడు. ఇంట్లో పెట్టి 10 రోజుల తర్వాత దాని నుంచి కొంచెం తేనె రుచి చూశాడు. స్వచ్ఛతతో పాటు రుచి బాగుంది. అప్పుడు ఉత్పత్తి మొదలుపెట్టాడు.
అభినందన.. అనుభవం
తేనెటీగలను పెట్టే ఒక్కో బాక్స్ ధర రూ.6వేల నుంచి రూ.10వేలు ఉంటుంది. అలా రెండు బాక్సులను కొనుగోలు చేశాడు. ఒక్కో బాక్సులో సుమారు 50వేల నుంచి లక్ష వరకు ఈగలు ఉంటాయి. ఆ బాక్సులను స్కేటింగ్ రింగ్ వద్ద చెట్లపై పెట్టాడు. 45రోజుల్లో తేనె చేతికి వచ్చింది. రెండు బాక్సుల నుంచి తేనె వేరు చేయడం సాధ్యం కాదని మరో 10 బాక్సులు కొనుగోలు చేశాడు. వరంగల్ శివారు స్తంభంపల్లి లోని ఓ రైతు పొలంలో వాటిని పెట్టాడు. 40రోజుల తర్వాత దాని నుంచి 10కిలోల తేనె వచ్చింది. తేనె రుచి చూసిన స్నేహితులు బాగుందని అభినందించారు. స్నేహితులు ఇచ్చిన అభినందన బిజినెస్‌గా మారింది. అయితే వెంటనే దెబ్బపడింది.
మొదటిసారి 10కిలోల స్వచ్ఛమైన తేనె వచ్చిన తర్వాత ధైర్యం చేసి 100 బాక్సులు కొనుగోలు చేసి వాటిని వర్ధన్నపేట శివారులోని ఓ చెలకలో పెట్టి పెంచాడు. లాభం రావడంతో మరో 200 బాక్సులు తెప్పించి అమ్మవారిపేటలో ఆవాల పంట వద్ద ఉంచాడు. అవి జన్యుమార్పిడి పంటలు కావడంతో బాక్సులోని తేనెటీగలు చనిపోయి తీవ్రంగా నష్టం వచ్చింది. వంద బాక్సులతో నష్టం వచ్చిన తర్వాత హర్షవర్ధన్ కుంగిపోలేదు. తేనె తయారీ కోసం మరింత శిక్షణ తీసుకున్నాడు. ఏడాదిలో తేనె ఉత్పత్తిపై మంచి అనుభవం సంపాదించాడు. పూర్తి పరిజ్ఞానంతో తేనెలో వివిధ రకాల రుచులు ఉంటాయని తెలుసుకున్నాడు. నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లోని ఆవాలు, నువ్వులు, అల్లనేరేడు, ఓమ తులసి పంట పొలాల్లో కొన్ని బాక్సులను పెట్టాడు. ఈ ప్రయత్నం ఫలించింది. 200 కిలోల తేనె వచ్చింది. మంచి లాభాలు వచ్చాయి. ఒక్కో పువ్వు నుంచి ఒక్కో రకమైన నాణ్యత, ప్రత్యేకమైన తేనె వస్తుందని గ్రహించాడు. నువ్వుల చేనులో పెట్టడం వల్ల నువ్వుల తేనె లభిస్తుంది. దీన్ని వినియోగించిన వారికి ఆరోగ్యపరంగా అవసరమైన కాల్షియం లభిస్తుంది. అడవి తులసి, ఆవాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, వామ, అల్లనేరడి తేనెలను మార్కెట్లోకి తెచ్చాడు.
ఆలోచన పెద్ద వ్యాపారమైంది..
హర్షవర్ధన్ రెండేండ్ల క్రితం ‘హర్ష్షాస్ నేచురల్ హనీ’ పేరుతో తేనెటీగల పెంపకం ప్రారంభించాడు. రెండు బాక్సుల నుంచి మొదలుపెట్టి 200 బాక్సులతో తేనెను ఉత్పత్తి చేసేందుకు కష్టపడ్డాడు. 45 రోజుల్లో 300 కిలోల తేనె ఉత్పత్తి అయ్యింది. ఈ తేనెను విక్రయించేందుకు హనుమకొండ సుబేదారి డీఐజీ బంగ్లా ఎదురుగా హర్షాస్ నేచురల్ హనీ స్టోర్‌ని తెరిచాడు. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో మరో 250 బాక్సులకు పెంచా డు. ప్రస్తుతం 450బాక్సులతో వివిధ రకాల నేచరల్ తేనెను అందిస్తున్నాడు. మొదట్లో మార్కెటింగ్ కోసం ఇబ్బందిపడినా ఇప్పుడు ఆన్లైన్లో, తెలిసిన వారు కొనుగోలు చేస్తుండడంతో బిజినెస్ బాగున్నది.