హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: జిల్లాలోని గ్రామాలలో చేపట్టిన భూ రీసర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని భూములు కొలతలు శాఖ కార్యాలయంలో జిల్లాలోని 70 గ్రామాలలో చేపట్టిన రిసర్వే వివరాలను సాఫ్ట్వేర్ లో నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల రీ సర్వే ను 5 దశల్లో చేపట్టిన వివరాలను భూములు, కొలతలు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డీఐ సారంగపాణి తెలిపారు.
రీసర్వేలో ముందుగా గ్రామ సరిహద్దు నిర్ధారణకు సర్వే, గ్రామకంఠం సరిహద్దుల సర్వే, ప్రభుత్వ కాలువలు రోడ్లు శిఖం భూముల సర్వే, ప్రభుత్వ ఆస్తులు, పాఠశాలలు, దవాఖానలు, అసన్ చేసిన భూముల రీ సర్వే, పట్టాదారు భూముల రీ సర్వేను చేపట్టినట్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ సర్వేకు సంబంధించి డేటాను సాఫ్ట్‌వేర్‌లో క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే వివరాలను, ల్యాండ్ పార్సల్ మ్యాప్స్( ఎల్పిఎం) సిద్ధం చేస్తున్నారా అని కలెక్టర్ అడిగారు. రైతులవారీగా పాలిగన్ మ్యాప్‌ల నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీ సర్వే సమగ్ర వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా సర్వేయర్లు స్టాలిన్, విజయ్, సుజాత ఉన్నారు.