స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ మాట్లాడుతూ.. రాజయ్య జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో బెదిరించడం కడియం శ్రీహరికి అలవాటేనని ఆరోపించారు. రాజయ్య కుటుంబ నేపథ్యం, ఆయన రాజకీయ ప్రస్థానం ప్రజలకు తెలుసన్నారు.
కుటుంబంలో వైద్యులు ఉన్నప్పటికీ సొంత ఆసుపత్రి నిర్మించుకోకుండా ప్రజాసేవకు అంకితమైన నాయకుడు రాజయ్య అని పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటులో రాజయ్య కీలక పాత్ర పోషించారని, ఆ విషయంలో తన ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం కోల్పోయారని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాజయ్యకు రాజకీయ పునర్జన్మ లభించిందని, అయితే కడియం శ్రీహరి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన కేసీఆర్‌ను, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.తన కూతురి రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారారని ఆరోపించారు. కాలుకు బలపం కట్టుకుని గ్రామగ్రామం తిరిగి సంక్షేమ పథకాలను వివరించి కడియంను గెలిపించిన నాయకుడు రాజయ్యేనని అన్నారు.
ఏడు రిజర్వాయర్లకు రాజయ్య కృషి
2004లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఒక్క రిజర్వాయర్ కూడా ఉందా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దేవాదులకు పునాదులు పడిన ప్రాజెక్టులను అనంతరం ఏడు రిజర్వాయర్లుగా పూర్తి చేసి ప్రారంభించిన ఘనత రాజయ్యదేనని పేర్కొన్నారు. లింగంపల్లి ప్రాజెక్టు పేరుతో నాలుగు గ్రామాలను ముంపునకు గురిచేసి, హనుమకొండలో ఇళ్లు నిర్మించుకున్నారంటూ కడియం శ్రీహరిపై ఆరోపణలు చేశారు.
జీవో 97 రద్దు చేయాలి
రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పుకోవడం కాకుండా దమ్ముంటే జీవో 97ను రద్దు చేయాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన ఇరిగేషన్ పనులకు రీ ఎస్టిమేషన్లు వేయించి, వాటిని తాము చేసిన పనులుగా చెప్పుకోవడం సరికాదన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో మీడియా సమావేశాలు పెట్టించి తమ నాయకుడిపై విమర్శలు చేయించడం మానుకోవాలని సూచించారు.
‘ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య అని చెప్పుకుంటే సిగ్గుపడుతున్నాం’ అని కడియం వ్యాఖ్యానిస్తే, తాము గెలిపించిన తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లిన కడియంను ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి తామే సిగ్గుపడుతున్నామని బీఆర్ఎస్ నేతలు ప్రతిస్పందించారు.ఎంజీఎం దవాఖానలో పెచ్చులు ఊడుతున్న అంశంపై పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్‌లో తిరిగి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో జఫర్‌గఢ్, లింగాలఘణపూర్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి జయపాల్‌రెడ్డి, చౌదరపల్లి శేఖర్, కౌన్సిలర్లు తాటికొండ మధు, బాలగాని అనిల్, పొన్న రాజేష్, చల్ల రమ్యారఘురెడ్డి, మున్సిపల్ కన్వీనర్ కనకం గణేష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, నాయకులు శీలం శ్యామ్, సోషల్ మీడియా ఇన్చార్జి గట్టు కృష్ణసాయి, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, కుంభం కుమారస్వామి, చింత శ్రీను, ఆకారపు అశోక్, చిట్టిబాబు, హీరాసింగ్, తదితరులు పాల్గొన్నారు.