ఎవరికి వారే!
దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతర పనుల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ కరువవుతున్నది. ఆయా శాఖల అధికారులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి.
- అధికారుల్లో సమన్వయ లోపం.. భక్తులకు సంకటం.. మహా జాతర పనుల్లో నిర్లక్ష్యం
- ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల తలోదారి
- పర్యవేక్షణ లేక ముందుకు సాగని పనులు
- ఇంకా ఏర్పాటుకాని తాత్కాలిక బస్టాండ్
- దేవాదాయ శాఖ పనులు, సీసీ రోడ్లదీ ఇదే దుస్థితి
వరంగల్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతర పనుల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ కరువవుతున్నది. ఆయా శాఖల అధికారులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు, ములుగు జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగనుంది. భక్తులు ఇప్పటి నుంచే భారీగా వస్తున్నారు. ఆది, బుధవారాల్లో వేలాది మంది తల్లులను దర్శించుకుంటున్నారు. సెలవు రోజుల్లో రద్దీ అధికంగా ఉంటున్నది. ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు మేడారం వచ్చే భక్తులకు కనీస వసతులు ఉండడం లేదు. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ నిధులతో పనులు చేపట్టారు. జాతర దగ్గర పడుతున్నా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
మేడారం జాతరకు పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వస్తుంటారు. జాతరకు వచ్చే దాదాపు కోటి మందిలో 90 శాతం వీరే ఉంటారు. వీరు ఆర్టీసీ బస్సుల్లోనే జాతరకు వస్తారు. జాతర సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ పార్కింగ్ ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ వాహనాలను వన దేవతల గద్దెలకు చాలా దూరంలో నిలుపుతారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు గద్దెల దగ్గరి వరకు పోతారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడారంలో బస్టాండ్ నిర్వహణ ఉంటుంది. జాతరకు వచ్చి వెళ్లే లక్షల మందితో ఈ బస్టాండ్ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేస్తుంది. భక్తుల తాకిడి నానాటికీ పెరుగుతున్నా ఈ సారి ఇంకా బస్టాండ్ పనులు పూర్తి కాలేదు. కొద్ది ప్రాంతంలోనే చదును చేసి వెదురు పందిళ్లు వేశారు. టిక్కెట్లు ఇచ్చే, ఆర్టీసీ సిబ్బంది ఉండే ప్రదేశంలోనే పనులు పూర్తయ్యాయి. భక్తులు వచ్చి వెళ్లేందుకు వీలుగా ఉండే ప్రాంతంలో ఇంకా భూమి చదును పూర్తి కాలేదు.
కొలిక్కిరాని పారిశుధ్య పనులు
మేడారం జాతరలో పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకమైంది. లక్షల మంది వచ్చి వెళ్లే జాతరలో అపరిశుభ్రతతో అందరికీ ఇబ్బందులు కలుగుతాయి. గత జాతర కోసం కేసీఆర్ ప్రభుత్వం 320 కేంద్రాల్లో 6,400 మరుగుదొడ్లు నిర్మించింది. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద భక్తులు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించింది. పారిశుధ్య నిర్వహణ కోసం నాలుగు వేల మంది కార్మికులను నియమించి మేడారం పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచే ఏర్పాట్లు చేసింది. 100 ట్రాక్టర్లు, 20 టాటా ఏస్ వాహనాలు, ఎనిమిది ఎక్స్కవేటర్లతో నిత్యం చెత్తను తొలగించేవారు. గత జాతర నిర్వహణ కోసం చేసిన నిర్మాణాలు వానకాలంలో వచ్చిన భారీ వరదలతో కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ చేయాల్సిన అవసరం ఉన్నది. జాతరకు అనుగుణంగా ఈ పనులు పూర్తి కావాలి. తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. దేవాదాయ శాఖ చేపట్టిన చలువ పందిళ్లు, సున్నాల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భక్తుల భద్రతా పర్యవేక్షణ కోసం మేడారం గద్దెల పక్కన నిర్మిస్తున్న పోలీస్ ఔట్ పోస్టు పనులు ఇంకా పూర్తి కాలేదు. చింతల్ క్రాస్ నుంచి మేడారం వరకు రూ. 2కోట్ల85 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పూర్తి కాలేదు. పర్యవేక్షణ లేకనే ఇలా జరుగుతోందని అధికారుల్లోనే చర్చ జరుగుతున్నది. జిల్లాలోని ఉన్నతాధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులు ఎవరికి వారుగా తమకు తోచినట్లు పనులు చేసుకుంటూ పోతున్నారని, ఇలాంటి సమన్వయ లేమి పరిస్థితులు గతంలో ఎప్పూడు లేవని అధికార వర్గాలు అంటున్నాయి. పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల మధ్య సమన్వయం కుదిరితేనే జాతరకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
హడావుడే ఎక్కువ..
జాతర ఏర్పాట్లకు సంబంధించి మంత్రులు అప్పడప్పుడు మేడారం వస్తున్నారు. దర్శనాలు, ఇతర హడావుడి తప్ప పనులపై సమగ్రమైన సమీక్షలు జరపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. జాతర జరిగే నాలుగు రోజుల్లో లక్షలాదిగా వచ్చే భక్తులు, వీఐపీల రాకపోకల కోసం చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షలో చర్చ జరగడం లేదని అధికారులే చెబుతున్నారు. మంత్రులు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు హడావుడి తప్ప పనులను స్వయంగా పర్యవేక్షించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జాతర నిర్వహణలో కీలకమైన ఆదివాసీ వర్గాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించలేదన్న చర్చ జరుగుతున్నది. జాతర క్రతువులు, వాటికి సంబంధించిన అంతర్గత ఏర్పాట్లపైనా ఆదివాసీలతో చర్చిస్తే బాగుంటుందని కింది స్థాయి సిబ్బంది సూచిస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

