హనుమకొండ చౌరస్తా, నవంబర్ 7 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రూ. కోట్లతో కొలువులు కొట్టేశారు. ఏకంగా ఓ విద్యార్థికి సంవత్సరానికి రూ. 1.27 కోట్ల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. వరంగల్ నిట్‌లో ఇదే అత్యధిక రికార్డు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్థి నారాయణ త్యాగి బహుళ జాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్లతో ఆఫర్ పొందాడు. గతంలో ఉన్న రూ.88 లక్షల ప్యాకేజీని అధిగమించాడు. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మహ్మద్ నహిల్ నష్వాన్ (ఖమ్మం) రూ. కోటితో జాబ్ సాధించా డు.
ఈ ఘనత వరంగల్ నిట్‌ను దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరిం గ్ విద్యా సంస్థల్లో ఒకటిగా నిలబెట్టిందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపా రు. ఇప్పటివరకు ప్లేస్మెంట్ సీజన్ తొలి రెండు నెలల్లో రూ.70 లక్షలకు పైగా ఆరుగురు, రూ.50 లక్షలకుపైగా34 మంది, రూ.30 లక్షలకుపైగా 125 మంది, రూ.25 లక్షలకుపైగా 163 మంది, రూ.20 లక్షలకుపైగా 200 మందికిపైగా విద్యార్థులు ఆఫర్లు పొందారని తెలిపారు. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బృందానికి, హెడ్ ప్రొఫెసర్ పీవీ సురేశ్‌కు నిట్ డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.