గిర్మాజీపేట, మార్చి 7: మహిళా ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం అని.. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని డీఎంహెచ్వో కాజీపేట వెంటకరమణ మంగళవారం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల ఆరోగ్య సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పర్వతగిరి (వర్ధన్నపేట నియోజకవర్గం), చెన్నారావుపేట (నర్సంపేట నియోజకవర్గం), కీర్తినగర్ (పరకాల నియోజకవర్గం), రంగశాయిపేట (వరంగల్ తూర్పు నియోజకవర్గం) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం మహిళా ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించన్నుట్లు పేర్కొన్నారు. పర్వతగిరి పీహెచ్సీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చెన్నారావుపేట, కీర్తినగర్, రంగశాయిపేట పీహెచ్సీల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. కలెక్టర్ గోపి ఆదేశాల మేరకు జిల్లాలోని ఈ నాలుగు పీహెచ్సీల్లో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ గోపాల్రావు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళా ఆరోగ్యానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని తెలియజేశారు. ఇందుకు 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ఆరోగ్య సమస్యలపై మహిళా వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తూ తగిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలియజేస్తారని పేర్కొన్నారు. ప్రతి మంగళవారం ఓపీ నిర్వహిస్తారని డీఎంహెచ్వో వెల్లడించారు. సాధారణంగా మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్, రక్తహీనత, మూత్రకోశ సంబంధిత వ్యాధులు, లైంగిక సంబంధమైన అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్, అసహజమైన రుతచక్ర సమస్యలు, శారీరక బరువు మేనేజ్మెంట్ పరీక్షలు చేస్తారని తెలిపారు. వారికి అవసరమైన వైద్యం ఇక్కడ అందుబాటులో లేకుంటే నర్సంపేట సీహెచ్సీ లేదా ఎంజీఎం దవాఖానకు రెఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వివరించారు. ఆశ, ఆరోగ్య కార్యకర్తలు 18 ఏండ్లు నిండిన మహిళలను జిల్లాలోని ఈ నాలుగు సెంటర్లకు రెఫర్ చేయాలని డీఎంహెచ్వో ఆదేశించారు. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకో వాలని ఆయన కోరారు.