కాశీబుగ్గ, మే 15 : వరంగల్ నగరంలోని దేశాయిపేట సమీపంలోని చిన్నవడ్డేపల్లి చెరువులో శుక్రవారం పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. చేపలపై విష ప్రయోగం జరిగిందా.. లేదా డ్రైనేజీల ద్వారా వచ్చే మురుగు నీరు విషతుల్యంగా మారిందనా?, లేక జంతు కళేబరాలు, కుళ్లిపోయిన చికెన్, ఇతర వ్యర్థాలు చెరువులో వేయడంతో నీరు కలుషితంగా మారి చేపలు మృతి చెందాయా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దానికి తోడు ఇటీవల అభివృద్ధి పనుల పేరుతో చెరువు చుట్టు పక్కల మట్టి తవ్వి కట్టకు పోస్తున్న క్రమంలో నీటిశాతం తగ్గి చేపలకు సరిపడా ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమారు 10 టన్నుల చేపలు మృతిచెందినట్లు తెలుస్తున్నది. చేపల మృతిపై కార్పొరేషన్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని మత్స్యకారులు అంటున్నారు. చెరువునే నమ్ముకొని ఆధారపడి జీవిస్తున్న తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.