హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 17 : కాకతీయ విశ్వవిద్యాలయం గురువారం నుంచి పీహెచ్డీ కేటగిరి-2 ఇంటర్వ్యూల ప్రక్రియను షురూ చేసింది. పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నది. గత సంవత్సరం నవంబర్‌లో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. యూనివర్సిటీ న్యాక్-ఏ ప్లస్ సాధించిన తర్వాత చేపడుతున్న పీహెచ్డీ సీట్ల ఎంపిక పూర్తిగా ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సహా వివిధ అధ్యయన రంగాల్లో ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి.
స్పెషలైజేషన్లు.. సీట్లు..
ఇంగ్లిష్ 7, తెలుగు 11, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 18, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 11, సివిల్ ఇంజినీరింగ్ 6, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 12, ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 4, మెకానికల్ ఇంజినీరింగ్ 14, లా 4, ఫార్మసీ 27, బయో టెక్నాలజీ 3, కెమిస్ట్రీ 7, కంప్యూటర్ సైన్స్ 6, జియాలజీ 2, మేథమెటిక్స్ 12, మైక్రోబయాలజీ 7, ఫిజిక్స్ 6, జువాలజీ 18, స్టాటిస్టిక్స్ 1, ఎకనామిక్స్ 2, హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 8, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 2, పొలిటికల్ సైన్స్ 10, సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ 4 సీట్లు ఉన్నాయి. కాగా, విద్యార్థి సంఘాలు సీట్లు పెంచాలని కోరుతున్నారు. అలాగే మొదటిసారి వీడియో రికార్డింగ్ ద్వారా యూనివర్సిటీ పీహెచ్డీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పకడ్బందీగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థిని అడిగే ప్రశ్నలు, చెప్పే సమాధానాలు పూర్తిగా రికార్డింగ్ కానున్నాయి. ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా సీట్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
ప్రతిభ ఆధారంగానే సీట్లు : ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, వైస్ చాన్స్‌లర్, కేయూ
కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ సీట్ల భర్తీ పారదర్శంగా చేపట్టాం. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు వివిధ విభాగాల్లో పీహెచ్‌డీల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు జరుగుతున్నాయి. ప్రక్రియ మొత్తాన్ని చిత్రీకరిస్తున్నాం.