ఐనవోలు, జూన్ 8 : ఆర్ఎంపీ వైద్యుడు చేసిన వచ్చిరాని వైద్యంతో ఓ వృద్ధురాలి చెయ్యిని తొలగించాల్సి పరిస్థితి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గందేపల్లి ఉప్పలమ్మ అనే వృద్ధురాలి(59)కి గతేడాది పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పని చేయకుండా పోయింది. గత నెల 30న గురువారం ఉప్పలమ్మకు వాంతులు కాగా, శుక్రవారం స్థానికంగా ఉన్న ఆర్ఎంపీతో వైద్యం చేయించారు.
నీరసంగా ఉండడంతో ఆమెకు ఇంటి దగ్గరే ఎడమ చెయ్యికి గ్లూకోజ్ పెట్టాడు. రెండో రోజున చెయ్యి కొంచెం నల్ల బడిందని కొడుకు రాజు, కోడలు అపర్ణ ఆర్ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఏమీకాదంటూ మళ్లీ రెండు ఇంజెక్షన్లు వేశాడు. చెయ్యి పరిస్థితి మరింత విషమంగా మారడంతో బుధవారం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా ఉప్పలమ్మను పరీక్షించిన వైద్యుడు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించిన వైద్యం వరంగల్‌లో లేదని నిమ్స్‌కు రెఫర్ చేశాడు.
దీంతో కుటుంబ సభ్యులు ఉప్పలమ్మను ఈ నెల 6న గురువారం ఉదయం నిమ్స్ తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు చెయ్యికి ఇన్స్పెక్షన్ ఉందని, తొలగించాల్సి వస్తుందని, హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా లేక వరంగల్ ఎంజీఎం దవాఖానలో చేర్పించాలని సూచించారు. దీంతో బాధితులు గురువారం సాయంత్రం ఎంజీఎం దవాఖానలో చేర్పించారు. శుక్రవారం ఉదయం ఉప్పలమ్మను పరీక్షించిన వైద్యులు చెయ్యిని తొలగించాలని సూచించా రు. సర్టికల్ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలో పక్షవాతం కారణంగా కుడి చెయ్యి పని చేయకుండా పోయింది. ఇప్పుడు ఆర్ఎంపీ వైద్యం వికటించి ఎడమ చెయి కోల్పోబోతుందని కొడుకు రాజు, కొడులు అపర్ణ కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.