హనుమకొండ/మహబూబాబాద్ రూరల్, మే 15: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చేతగాని డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టు పునరుద్ధరణ, నిర్వహణ చేతకాక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరాన్ని కేసీఆర్ మూడేళ్లలోనే నిర్మిస్తే.. ఓర్వలేక కాంగ్రెస్ సరార్ కుళ్లు రాజకీయం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
లక్షలాది ఎకరాలకు నీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగితే, మొత్తం ప్రాజెక్టే విఫలమైందనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో రాజకీయం చేయడం లేదని చెప్తున్న మంత్రి ఉత్తమ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వేసవిలో సీడబ్ల్యూపీఆర్ఎస్, ఎన్జీఆర్ఐ, సీడబ్ల్యూసీ ఇండియన్ ఆర్మీ ఇంజినీరింగ్ విభాగాలను తెస్తున్నామంటూ కొత్త నాటకాలకు తెరలేపిందని విమర్శించారు.
నిపుణుల కమిటీల పేరుతో కాలం వెళ్లదీస్తూ ప్రాజెక్టును ఎండబెట్టి రైతాంగానికి ద్రోహం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు నైజమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా నేడు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయి, రైతాంగం రోడ్డున పడ్డారని తకెళ్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాళేశ్వరంపై నిందారోపణలు బంద్ చేయాలని, తక్షణమే మరమ్మతులు పూర్తి చేయించి, ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.