కాజీపేట, జూలై 12: ప్రధాని మోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. కాజీపేట పట్టణంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1980లో హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన పీవీ నర్సింహారావు 1982లో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయించారని, దాని కోసం అప్పట్లోనే మడికొండ, రాంపూర్, అయోధ్యపురం, తరాలపల్లి, పెండ్యాల్ తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూమిని సర్వేలు చేశారని తెలిపారు. దేశంలో అల్లర్ల కారణంగా రాజీవ్-లోంగోవాలా ఒప్పందంతో కపుర్తాలకు తరలిపోయిందని గుర్తుచేశారు. 40 ఏండ్లుగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చేశారని, దశాబ్ధాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఇక రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని 2018 కన్నా ముందు చాలాసార్లు కేసీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ఎంపీలందరం ప్రధాన మంత్రిని కోరామన్నారు.
దేశంలోని కోచ్‌ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పి, అవసరం ఉంటే కాజీపేటకు మంజూరు చేస్తామన్నారు. గతంలోని కేంద్ర రైల్వేమంత్రులు వారి రాష్ర్టాలకు కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. 2018లో మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ లాథుర్కు కోచ్‌ఫ్యాక్టరీ, 2022లో గుజరాత్ ఎన్నికల సభలో గుజరాత్‌కు రూ.20వేల లక్షలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. దేశంలో కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని చెప్పి, ఆతర్వాత పలు ప్రాంతాల్లో ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపుతోందని పేర్కొన్నారు. కాజీపేటకు కేవలం రైల్వే వ్యాగన్ పీవోహెచ్‌ను ప్రకటించిందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత నెల 31న దినపత్రికల్లో ప్రధాని మోదీ కాజీపేటలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్ శంకుస్థాపనకు వస్తున్నట్లు వార్తలు రాగా తెలంగాణలో నిరసనలు హోరెత్తాయని, దీంతో కేంద్రం దిగి వచ్చి జూలై 8న ప్రధాని మోదీ రైల్వే వ్యాగన్ పీవోహెచ్‌ను రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేసి శంకుస్థాపనకు వస్తున్నట్లు మరో ప్రకటన వచ్చిందని వివరించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు అఖిలపక్ష పార్టీలను కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు. కాజీపేటకు కోచ్ మంజూరైతే వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి దొరుకుతాయన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెర వేర్చాలని డిమాండ్ చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకూ ఉద్యమిస్తాం : చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
రైల్వే కార్మికులతో ఒకప్పుడు కళకళలాడిన కాజీపేట రైల్వే జంక్షన్ సమైక్య పాలనలో వెలవెలబోయిందని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ పూర్వ వైభవానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. కాజీపేట నుంచి తరలిపోతున్న రైల్వే కార్యాలయాలను తిరిగి రాబట్టామన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన ఉమ్మడి జిల్లా హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ కోసం కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామన్నారు. తెలంగాణప్రజల కష్టాలను దగ్గరినుంచి చూసిన ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు.
కోచ్ ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చేందుకు సిద్ధం : వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట నియోజకవర్గంలోని అయోధ్యపురంలో కేంద్ర ప్రభుత్వం కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే కావాల్సిన భూమిని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించి రైల్వేకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రజల 40 ఏండ్ల ఆకాంక్ష మేరకు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, ఇండ్ల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, జోరిక రమేశ్, శివశంకర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, సుంచు కృష్ణ, పాలడుగుల శివకుమార్, శిరుమల్ల దశరథం, సోనీ, పబ్బోజు శ్రీకాంతాచారి, దువ్వ కనుకరాజు, గబ్బెట శ్రీనివాస్, అఫ్జల్, హుస్సేన్, అయ్యాల దానం, తేలు సారంగపాణి, నయీం జుబేర్, పాము రాజేశ్, మర్యాల కృష్ణ, బెడరికోట రంజిత్, బోళ్ల కుమారస్వామి, సిరిల్ లారెన్స్, రంజిత్, మహిమూద్, కోండ్ర శంకర్, మైలారం శంకర్, సుబ్బు, వెంకటేశ్, పోతుల సాంబయ్య, రాంచందర్, శేఖర్, విజయ్‌భాస్కర్, కరుణాకర్ పాల్గొన్నారు.