నచ్చిన చోట కోరుకున్న తీరులో ఇల్లు.. విల్లా.. అపార్ట్మెంట్.. ఏదైతేనేం అనుకున్నదే తడవుగా అత్యాధునికంగా.. అన్ని వసతులతో నిర్మించడంలో డెవలపర్స్, బిల్డర్స్ ముందుంటున్నారు. రోజురోజుకూ విస్తరిస్తున్న నిర్మాణరంగంలో యువకులు తమ భవిష్యత్‌ను వెతుక్కుంటున్నారు. కన్స్ట్రక్షన్పై క్రేజ్‌తో ఈ రంగంలో స్థిరపడి వేలాదిమందికి జీవనోపాధి కూడా చూపిస్తున్నారు. అనుకున్న సమయానికి కలల సౌధాలను కళ్లెదుట సాక్షాత్కరింపజేస్తున్నారు. మరోవైపు రుణాలు ఇస్తూ బ్యాంకులు సైతం ఊతమిస్తుండగా మధ్య తరగతి ప్రజలు సైతం సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో చాలా మంది నగరాల్లోనే కాకుండా శివారు ప్రాంతాల్లో విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారు.
– వరంగల్, నవంబర్ 24
బ్యాంకుల ఊతం
నిర్మాణ రంగం పుంజుకునేందుకు బ్యాంక్‌లు ఇచ్చే హౌసింగ్ రుణాలు ఊతమిస్తున్నాయి. వంద గజాల స్థలం ఉంటే చాలు బ్యాంక్‌లు హౌసింగ్ రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీంతో చాలా మంది మధ్య తరగతి ప్రజలు బ్యాంక్‌లు ఇస్తున్న హౌసింగ్ రుణాలతో సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. సొంతంగా ఇంటి నిర్మాణాలతో పాటు బిల్డర్లు చేపట్టే అపార్ట్మెంట్ల నిర్మాణాలు సైతం జోరుగా సాగుతున్నాయి. నిర్మాణ రంగం పుంజుకోవడంతో ఈ రంగానికి అనుబంధంగా ఉన్న ముడి సరుకుల వ్యాపారాలు ఢోకా లేకుండా కొనసాగుతున్నాయి. ఇసుక, ఇటుక, స్టీల్, సిమెంట్, పెయింట్స్ వ్యాపారాలతో పాటు ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.
వేలాది మందికి ఉపాధి
మానవ వనరులపై ఆధారపడే నిర్మాణ రంగంలో వేలాది మందికి ఉపాధి దొరుకుతున్నది. ఇక్కడి వారికే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి వచ్చిన సుమారు పది వేల మంది కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్లు అంచనా. ఇటుక తయారీ కాన్నుంచి ఇంటీరియర్ సామగ్రి వరకు వేలాది మంది నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో బిల్డర్ వద్ద సుమారు వందకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా కాలంలో కాస్త కుదేలైన నిర్మాణ రంగం ఏడాదిగా ఊపందుకున్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు విరివిగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం నగరంలో జరుగుతున్న నిర్మాణాలు ఎక్కువ శాతం బిల్డర్స్ చేపట్టినవే ఉన్నాయి. పేరున్న డెవలపర్ సంస్థలు ఒకే సమయంలో రెండు, మూడు ప్రాంతాల్లో వెంచర్లు వేస్తున్నాయి. మధ్య తరగతి వర్గాలకు అనుకూల ధరలతో నిర్మాణాలు చేపడుతూ మార్కెట్‌ను నిలబెడుతున్నాయి. కోరుకున్న చోట కోరుకున్నట్లుగా అందుబాటు ధరల్లో నాణ్యతతో కూడిన భవనాలను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోనే కాకుండా శివారుల్లో విల్లాల నిర్మాణం ఎక్కువగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో మెరుగైన రవాణాతో చాలా మంది నగరాల్లోనే కాకుండా శివారు ప్రాంతాల్లో విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్మెంట్స్ నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారు.
ఇష్టమైన తీరుగా నిర్మాణం
కొనుగోలు చేసే వ్యక్తికి ఇష్టమైన తీరులో నిర్మాణం చేసి ఇస్తున్నాం. ఇండిపెండెంట్ విల్లాస్తో పాటు అపార్ట్మెంట్లు అన్ని వసతులతో కడుతున్నాం. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు చేస్తున్నాం. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ లే అవుట్లతో వెంచర్లు చేస్తూ మార్కెట్లో కస్టమర్ల నమ్మకాన్ని పొందుతున్నాం. కొంత కాలంలోనే మైత్రీ ఎన్క్లేవ్స్, రెసిడెన్సీల పేరిట వెంచర్లను విజయవంతంగా పూర్తి చేశాం.
-జయదీప్‌రెడ్డి, ఎండీ, మైత్రీ ఎన్క్లేవ్స్, మైత్రీ రెసిడెన్సీ
సులువుగా హౌసింగ్ రుణాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సులువుగా హౌసింగ్ రుణాలు ఇస్తున్నాం. 1.20శాతం వడ్డీతో హౌసింగ్ రుణాలు మంజూరు చేస్తున్నాం. రూ.10లక్షల రుణానికి 10శాతం, రూ.30లక్షల దాకా రుణం పొందేవారు 20 శాతం వాటా ధనం చెల్లించాలి. అన్ని డాక్యుమెంట్లు సమర్పించిన నాలుగు రోజుల్లో రుణం మంజూరు చేస్తాం. అపార్ట్మెంట్లలో ప్లాట్లు, పాత ఇండ్ల కొనుగోలుపైనా రుణాలు మంజూరు చేస్తున్నాం. ప్రజలకు హౌసింగ్ రుణాలను త్వరగా ఇచ్చేలా కృషి చేస్తున్నాం.
– పంకజ్ కుమార్, రీజనల్ హెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హౌసింగ్ రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి
బ్యాంక్ నుంచి హౌసింగ్ రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వ్యవసాయ భూములను మార్టిగేజ్ చేసుకొని బ్యాంక్ ద్వారా హౌసింగ్ రుణాలు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతం వారికి రూ.30 లక్షలు, మండల కేంద్రానికి చెందినవారికి రూ.50లక్షలు, నగరంలో ఇంటి స్థలాలపై రూ.70లక్షల వరకు హౌసింగ్ రుణాలు ఇస్తున్నాం. హౌసింగ్ లోన్లతో పాటు రైతుల పిల్లలకు ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్లను కూడా బ్యాంక్ ద్వారా అందిస్తున్నాం.
– మార్నేని రవీందర్రావు, చైర్మన్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్
అందుబాటు ధరల్లో ప్లాట్లు
వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు నిర్మాణ రంగం జోరుగా సాగుతున్నది. దానికి అనుగుణంగా అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో వెంచర్లు చేస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీకి అనుగుణంగా విల్లాల నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పటికే చాలా వెంచర్లు చేశాం. ప్రస్తుతం హనుమకొండకు 9 కిలోమీటర్ల దూరంలో వెంచర్ చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలకు విక్రయిస్తున్నాం.
– బిల్లా రమణారెడ్డి, బిల్లా ఇన్ఫ్రా కన్స్‌స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఎండీ
అపార్ట్మెంట్ కల్చర్పెరిగింది
నగరాల్లో ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు అపార్ట్మెంట్ల వైపు చూస్తున్నారు. దీంతో వారి సొంతింటి కలలు నెరవేర్చేలా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నాం. బ్యాంక్‌లు హౌసింగ్ రుణాలు ఇవ్వడంతో అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ పెరుగడంతో నిర్మాణ రంగం బలంగా పుంజుకుంటోంది. చాలామంది ఔత్సాహికులు నిర్మాణ రంగంలోకి కొత్తగా అడుగు పెడుతున్నారు.
– చంద్రమౌళి, అవని ఇన్ఫ్రా, డెవలపర్స్ ఎండీ