సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Jan 25, 2020 , 02:38:55

దేవాదులతో ప్రతి ఎకరాకు నీరు

దేవాదులతో ప్రతి ఎకరాకు నీరు
  • భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం
  • మూడు పంటలకు ఢోకా ఉండదు
  • ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్
  • ఎస్సారెస్పీ కెనాళ్ల పరిశీలన

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జనవరి 24 : దేవాదుల, ఎస్సారెస్పీ ప్రధాన, ఉపకాల్వల ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఖిలావరంగల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న దేవాదుల కాల్వను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పీజే పాటిల్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, దేవాదుల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన కాల్వ నుంచి వర్ధన్నపేట, సంగెం మండలాల్లోని గ్రామాలకు నీటిని తరలించేందుకు సింగారం మీదుగా ఉపకాల్వను నిర్మించినట్లు చెప్పారు. కానీ జాతీయ రహదారి బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద అడ్డుగా రావడంతో కాల్వ మరమ్మతు పనులు నిలిచిపోయినట్లు వివరించారు. భూసేకరణలో కూడా ఇబ్బంది ఏర్పడినందున కల్వను పూర్తిస్థాయిలో నిర్మించలేదని చెప్పారు.  కానీ కాల్వ నిర్మాణం పూర్తయినట్లయితే ఐనవోలు, సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట మండలాలోని గ్రామాలకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. కాలువ నిర్మాణం పూర్తి చేసేందుకు భూములు కోల్పోతున్న రైతులకు కూడా పరిహారం అందించి వారిని నష్టపోకుండా చూస్తామని రమేశ్ హామీ ఇచ్చారు. కాల్వ నిర్మాణం పూర్తయినట్లయితే నాలుగు మండలాల పరిధిలోని 38వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. వెంటనే కాల్వ నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను సూచించారు. ఇందుకోసం తమవంతుగా పూర్తిస్థాయి సహకారాన్ని అందిస్తామని ఆయన అధికారులకు సూచించడంతో పాటుగా కాల్వ నిర్మాణం చేసే విధానాన్ని ఎమ్మెల్యే రమేశ్ స్వయంగా మ్యాప్ ద్వారా అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ భిక్షపతి, దేవాదుల డీఈ కిషన్, జేఈ ఖాదర్, ఆర్‌అండ్‌బీ డీఈ మనోహన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo