సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jan 18, 2020 , 23:46:16

ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు

 ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ఓటు హక్కును ప్రతి ఒక్క రూ వినియోగించుకోవాలని కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా అన్నారు. శనివారం వికారాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఆలంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు 2కే రన్‌ నిర్వహించారు. అధికారులు, విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన కల్పించే విధంగా టీ షర్టులు, బ్యానర్లతో 2కే రన్‌ లో పాల్గొన్నారు. ఈ 2కే రన్‌ను కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయే షా, ఎస్పీ నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ మున్సిపాలిటీలలోని పట్టణ ప్రజలందరూ ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయాలని సూచించారు. నూటికి నూరు శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని అన్నారు. 2కే రన్‌లో పాల్గొన్న విద్యార్థులందరూ తమ ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

సెలవు దినమని ఇళ్లలో ఉండకుండా ప్రతి ఒక్కరు తమ వార్డులలోని పోలింగ్‌ స్టేషన్లలో వారి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజా స్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని, ఓటు విలువ తెలుసుకుని మంచి ప్రజా సేవ చేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు వేయాని వారితో ఓటు వేయించాలని, భావి భారత ప్రజా నాయకులు మీరేనని అన్నారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేసీ అరుణకుమారి, డీఆర్‌వో మోతిలాల్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీటీడీవో కోటాజీ, డీడబ్ల్యూవో జ్యోష్న, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, తహసీల్దార్‌ రవీందర్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సీడీఎంఏ శ్రీదేవి అన్నారు. శనివారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషాతో కలిసి ఓటరు అవగాహన (స్వీప్‌) కార్యక్రమం నిర్వహించారు.  ఓటు హక్కు పై చైతన్యం కలిగించేలా ముగ్గుల పోటీలు, మెహింది వంటి పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీడీఎంఏ శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. 70ఏండ్లకు పైబడి ఇప్పటికీ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పలువురిని ఆమె సన్మానించారు. అదే విధంగా 18ఏడ్లు నిండిన యువతను ఓటు హక్కు వినియోగించుకోవాలని సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా, జేసీ అరుణకుమారి, వికారాబాద్‌ ఆర్డీవో, ఎంఆర్‌వో, మున్సిపల్‌ కమిషనర్‌, మెఫ్మా అధికారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.logo