దక్షిణం ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టాలా? వద్దా? దయచేసి సలహా ఇవ్వండి.
– డి. ప్రభాకర్, చిట్యాల
మీరు ఇల్లు కట్టాలనుకునే స్థలం నైసర్గికంగా పటిష్ఠత కలిగి ఉండాలనేది ‘శాస్త్ర వచనం’. అది ఎంతో అవసరం కూడా. ఇంటికి దక్షిణంలో ఖాళీ స్థలం ఉండటం అనేది అనేక రూపాలుగా ఉంటుంది. ఆ స్థలం ఇతరులది లేదా పార్కు, ఊరి చివరి భాగం, ప్రభుత్వ స్థలం, ఎండిన వాగు నేల, నిండని కుంట, లోయ, అడవి.. రకరకాలుగా ఉండొచ్చు. ఏది ఏమైనా ఉత్తరోత్తరా.. ఆ స్థలంలో నిర్మాణాలు వస్తాయా? రావా? అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఆలస్యంగానైనా వస్తాయనుకొంటే మనం ఇల్లు కట్టవచ్చు. ఎప్పుడూ నిర్మాణాలు రానేరావని అనుకున్నప్పుడు ఇంటి నిర్మాణం మంచి ఫలితాలు ఇవ్వడంలో పూర్తిగా వెనకబడుతుంది. చేతులు మారుతుంది. అలాంటి చోట తెలిసి తెలిసీ ఇల్లు కట్టవద్దు.
తూర్పు ఇంటికి ముందువైపు వరండా కానీ, పోర్టికో కానీ తప్పకుండా కట్టాలా?
– సీహెచ్. ప్రసాద్, కొలనుపాక
మనం ఉష్ణ జీవులం. ఎండ ప్రాంతంలో జీవించేవాళ్లం. అందుకని తూర్పువైపు పందిరి కానీ, వరండా కానీ వేసుకోవడం మన గృహ నిర్మాణంలో భాగం. పైగా మన ప్రాంతీయులు వ్యవసాయం ఆధారంగా జీవించేవాళ్లు. సేద్యం పనిముట్లు వగైరా ఉంటాయి. అందుకోసం కూడా ఇంటి ముందు ‘వరండా’ వేస్తారు. అలా అని తప్పనిసరి కాదు. ఇంటి ముందు ఎక్కువ వెడల్పుతో పందిరి (తూర్పు – పడమరగా) వేస్తే ఇంట్లో వెంటిలేషన్ లేకుండా పోతుంది. కాబట్టి, అవసరం మేరకు వేసుకోవచ్చు. అయితే, పందిరి అయినా.. పోర్టికో లేదా వరండా అయినా ఇంటి వెడల్పుతో సమానంగా వేయాలి.
ఇంటి బయట మూలల్లో మెట్లు పెట్టుకోవచ్చా?
– ఆర్. సారంగపాణి, సిద్దిపేట
ఇంటికి బయట మూలల్లో మెట్లు పెట్టాలనుకుంటే.. ‘ఎల్’ ఆకారంలోనే రావాలి. ఇలాంటి మెట్లు ఆగ్నేయం మూల.. అంటే తూర్పు ఆగ్నేయం – దక్షిణ ఆగ్నేయం కలుపుకొని ఉండేలా.. కోణంలో ‘ఎల్’ ఆకారంగా పెట్టుకోవచ్చు. అవి దక్షిణం ఎక్కి, పడమర తిరిగి పైమేడలోకి దక్షిణం, ఆగ్నేయంగా వెళ్లేలా నిర్మించాలి. ఆవిధంగా వచ్చే మూలమెట్లు నైరుతిలో, ఈశాన్యంలో పెట్టవద్దు. కానీ వాయవ్యంలో పెట్టుకోవచ్చు. ఆ చోట పడమర ముఖంగా ఎక్కి మూల తిరిగి, పశ్చిమ వాయవ్యంలోని ద్వారం నుంచి లోపలికి వెళ్లేలా మూలమెట్లు పెట్టుకోవచ్చు. ఇలా ఇంటికి రెండు దిశల్లో పెట్టవచ్చు.
మా స్థలం ఊరికి ఉత్తరంలో.. చివరలో ఉంది. పడమర రోడ్డు ఉంది. అక్కడ ఇల్లు కట్టొచ్చా?
– ఎస్. అభిషేక్ రెడ్డి, తూప్రాన్
ఊరికి చివరలో పొలిమేర అంచున మీ స్థలం ఉంటే మంచిది కాదు. లేదూ.. ఆ చోట ‘లే అవుట్’ చేశారు. పడమర రోడ్డు ఉంది అన్నప్పుడు తప్పకుండా కాంపౌండు కట్టుకొని అందులో వాస్తుపరంగా ఇల్లు కట్టుకోండి. మీరు కట్టాలనుకునే స్థలం చిట్టచివరిది. మీ ఉత్తరంవైపు ఇండ్లు రావు.. ‘అది డెడ్ ఎండ్’ అయినప్పుడు, ఆ స్థలంలో ఇల్లు కట్టే ఆలోచన మానుకోండి. ఇతరుల స్థలాలు ఉత్తరంలో – తూర్పులో ఉన్నప్పుడు మీరు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు. మీ పడమర వీధి మీ ఇల్లు దాటి ఉత్తరంవైపు సాగిపోతూ ఉంటే కూడా మీ స్థలంలో ఇల్లు కట్టవచ్చు. ‘ఎండ్ ప్లేస్’ అయితేనే ఇల్లు కట్టడం మంచిదికాదు. అన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకోండి.
Vasthu | జాతకాన్ని పాటించాలా? వాస్తును పాటించాలా? ఏది ముఖ్యం?
ఆలయాల గర్భగుళ్లలో వెలుతురు ఉండదు. అది వాస్తు ఎలా అవుతుంది?