మా ఊరిలో ఇల్లు కట్టాలని అనుకుంటున్నాం. అక్కడ దొరికే సామగ్రిని బట్టి ఇంటిని కట్టాలా? లేకుంటే తప్పనిసరిగా స్లాబ్తోనే కట్టాలా?
– వి. మహేందర్, దిల్సుఖ్నగర్.
ఇంటిని ఎలా అయినా కట్టుకోవచ్చు. అందుకే అనేక ప్రాంతాలలో అనేక రకాల ఇళ్లు మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ఒకనాడు పెంకుటిళ్లు, తాటికమ్మల కప్పులతో ఇండ్లు కనిపించేవి. కాస్త మన్నెగూడా, పరిగి నుంచి కర్ణాటక పరిధిలోని గ్రామాలకు వెళ్తే.. అక్కడ సాబాద్ బండలతో ఇంటి కప్పులు వేస్తారు. అవన్నీ స్థానికంగా దొరికే సామగ్రితోనే కట్టినట్లు మనకు అర్థం అవుతుంది. ఇల్లు ‘ఖరీదు వస్తువా’.. ‘ఆడంబర వస్తువా’ అనేది శాస్త్ర విషయం కాదు. ఇల్లు.. ఆరోగ్యంగా, ప్రశాంతంగా, రక్షణగా ఉందా? అనేది శాస్త్రం యొక్క అంశం. రక్షణ అనేది ఆరోగ్య రక్షణ, ఆనంద రక్షణ. చట్టబద్ధతకు సంబంధించినది కాదు. మట్టి గోడలు, తాటికమ్మలు లేదా మట్టిపెంకులతో వేసిన పైకప్పు, దూలాలు, తాటి పట్టెలు పెట్టి కట్టిన పెంకుటిల్లు కూడా గొప్పగా ఉంటుంది.
కుండలో వండిన అన్నం.. కుక్కర్లో వండిన అన్నం.. ఈ రెండిటిలో ఏది గొప్పది అనేది వదిలి, ఏది ఆరోగ్యం అంటే.. ‘కుండ అన్నం’ అంటాం కదా!? ఇక్కడ ఇష్టాలు కాదు.. శాస్త్రం ప్రధానం. వ్యక్తిగత ఇష్టాలు ఎప్పుడైతే ఇంటి నిర్మాణంలోకి వచ్చాయో.. అన్నీ మారిపోయాయి. ఆధునిక హంగులు.. వసతులు ఇవ్వాళ పల్లెలకు కూడా చేరుకున్నాయి. ఖరీదైన ఇల్లు అనేది ఒక హోదాగా, గుర్తింపుగా మారిపోయింది. ఇల్లు అతి సహజంగా, ప్రకృతిసిద్ధంగా నిర్మితమవ్వాలి. దాన్ని మెయిన్టేన్ చేయడం కాస్త కష్టం కావచ్చు. కానీ, స్థానిక సామగ్రితో కట్టిన ఇల్లు ఎప్పుడూ తప్పుకాదు. అమ్మ.. ముతక చీర కట్టినా అమ్మే! పీతాంబరం, పట్టుచీర కట్టినా.. అమ్మే! శాస్త్రం.. ఇంటికి హృదయం లాంటిది. రూపంతో కాదు.. స్వరూపంతో అంటే, స్వభావంతో నిర్మితమయ్యేది. అందరూ వ్యక్తులే.. వ్యక్తిత్వాలను బట్టికదా జీవిత వైభవం నిలబడేది. ఇంటి నిర్మాణానికి కూడా అంత స్వభావసిద్ధ శాంతిధామం కావాలి. గృహం కూడా అంతే!
పడమరకు, దక్షిణానికి అద్దాలు (డ్రెస్సింగ్ టేబుల్) పెట్టకూడదా? బెడ్ రూముల్లో..
– బి. శకుంతల, రామన్నపేట.
ఈ మనిషి పుట్టకముందే భూమి పుట్టింది. పంచభూతాల ద్వారా మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వాస్తు అంటే.. వసతి. వాస్తు అంటే.. యోగ్యత. అయినదానికి, కానిదానికి అడ్డుకాలు వేయడం అజ్ఞాన బుద్ధులకు అలవాటు. కానీ.. శాస్ర్తానికి కాదు. గృహ నిర్మాణానికి ఎప్పుడైతే శాస్ర్తాన్ని ఆపాదిస్తారో.. ఆ ఇంట్లో దాదాపు అన్ని వస్తువులూ చక్కగా శాస్ర్తానికే వచ్చేస్తాయి. మాస్టర్ బెడ్రూమ్లో.. వాయవ్యంలో లేదా ఆగ్నేయంలో టాయిలెట్ వచ్చి, ఈశాన్యంలో ద్వారం వచ్చాక.. మిగతా స్థలం అనగా, దక్షిణం – పడమర ఫర్నిచర్ చేసుకొని, దానికి నిలువెత్తు అద్దాలు పెట్టుకున్నా దోషం కాదు. అంతేకాదు.. పడమర గదిలో తూర్పు – ఆగ్నేయంలో అలాగే ఉత్తర – వాయవ్యంలో డ్రెస్సింగ్ టేబుల్ కూడా అమర్చుకోవచ్చు. వాయవ్యంలో టాయిలెట్ వచ్చి, నైరుతి భాగాన కూడా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. ఇల్లు – విభజన సరిగ్గా జరిగితే చాలు.. అన్నీ చక్కగా కుదిరిపోతాయి.
ఇంట్లో దక్షిణ భాగం ఎత్తు చేసి నిర్మిస్తే.. ఐశ్వర్యం అంటారు కదా! అది ఇంట్లో ఎలా కట్టాలి?
– కె. పద్మ, పటాన్చెరువు.
ఇంటిని ఎత్తుపల్లాలు చేసి కట్టకూడదు. విరుద్ధ ఫలితాలు కలుగుతాయి. ఎత్తు పల్లాలు భూమికి అవసరం. దక్షిణం – పడమర – నైరుతి ఎత్తు కలిగిన భూమిలో సహజంగా తూర్పు – ఉత్తరం – ఈశాన్యం పల్లంగానే ఉంటాయి. అలాంటి స్థలం ఎంతో గొప్పది. స్థలానికి అవి వర్తిస్తాయి. అలాగని ఇంటిని కూడా అలా ఎత్తు పల్లాలతో కాకుండా.. స్థలంలో సరైన కొలత చేసి, స్థలం మూలమట్టానికి చేసి, శాస్త్రం సూచించిన స్థలంలో గృహ నిర్మాణానికి తగిన భూమిని ఒక స్థిరమైన ఎత్తులో కట్టాలి. అనగా.. బేస్మెంట్ తయారు చేసుకొని, దానిపైన గృహాన్ని నిర్మించాలి. ఇల్లు ప్రకృతి సహజమైనదిగా, కన్నతల్లిలా నిరాడంబరంగా నిర్మితమైతే చాలు.. అద్భుత ఫలితాలు ఇస్తుంది. దానికి హంగులు, ఆర్భాటాలు అక్కర్లేదు. ఇల్లు కట్టాల్సిన చోట ముందుగా తెలిసిన వారిచేత మంచి ప్లాన్ గీయించుకొని, రాజీ పడకుండా కడితే.. అది ఒక యోగం అంతే!
చేట ఆకారం, గొడ్డలి ఆకారం భూములు వద్దు అంటారు. మరి వాటిని ఎలా తెలుసుకోవాలి? భూమి అంతా ఒకటే కదా!?
– ఎన్. చంద్రశేఖర్, సిద్దిపేట.
అందరికీ సులభంగా అర్థం కావడానికి ఆనాడు అందరూ వాడుకునే వస్తువుల ఆకారంలో ‘భూమి హద్దులు’ ఉండకూడదని అలా చెప్పారు. మనం ఎంచుకునే భూమి ఆకారం ఎప్పుడూ దాని వ్యక్తిత్వాన్ని చాటుతుంది అనేది గ్రహించాలి. భూమి ఆకారం, హద్దు చాలా ముఖ్యం శాస్త్రంలో. ఎద్దు ఆకారం, గొడ్డలి ఆకారం, విసనకర్ర ఆకారం.. ఇవన్నీ వాటివాటి స్వభావాలను తెలుపుతాయి కదా! ఇది నిగూఢమైన విషయ సంగ్రహం. సూచన ప్రాయంగా చెప్పడం వల్ల మనం జాగ్రత్తగా ఉంటాం. అలాంటి స్థలాల జోలికి వెళ్లం. భూమి అంతటా ఒక్కటి కాదు. మొక్క మొక్కకూ ఎలా తేడా ఉంటుందో.. భూమి ఒకటిగా ఉన్నా.. ఆయా స్థలాలు ఆయా గుణాలతో ఉంటాయి. అందుకే పెద్దలు.. ‘ఎద్దు అడుగు జాగలో ఏడు రకాలు ఉంటాయి’ అని చెబుతారు. మీరు మీకు తగిన భూమిని తెలిసివారి చేత చూపించి.. దానిలో ఇల్లు కట్టుకోండి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143