– ఎ. శ్రీలత, కొండగట్టు
Vastu Shastra | ఇంటిని నాలుగు మూలలతో కట్టి.. ‘గుండ్రంగా’ కాంపౌండ్ నిర్మించాలనే ఆలోచనే తప్పు. ఇల్లు.. దాని చుట్టూ ఆవరణ, హద్దుల నిబద్ధత ఎంతో ముఖ్యం. అది ఫామ్‌హౌజ్ అయినా, సిటీలోని ఇల్లు అయినా. చూపుల కోసమో, చూపించడం కోసమో నిర్మాణాలు చేపడితే.. జనం పది నిమిషాలు చూసి, మెచ్చుకొని వెళ్లిపోతారు. కానీ, అందులో ఉన్నంతకాలం మనం శిక్ష అనుభవిస్తూనే ఉంటాం. గుండ్రని కట్టడానికి దిశలు కుదరవు. అష్ట దిశలు అడుగంటిపోతాయి. మన ఇంటి చుట్టూ ‘సుడిగుండం’లాంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రకృతి నిర్మాణం వృత్తం. మానవ నిర్మాణం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం. ఇది శాస్త్ర విదితం. ఎందుకు అనేది లోతైన చర్చనీయాంశం. అది ఇప్పుడు చేయలేం కానీ, మామూలుగా నలుచదరం కాంపౌండు కట్టుకొని ఆనందంగా ఉండండి.
– సీహెచ్ ప్రభాకర్, దిల్సుఖ్నగర్
శయన మందిరాలు దక్షిణ – పశ్చిమాలు రావడం శ్రేష్ఠం. కాలం సాగే క్రమంలో ఉదయం – మధ్యాహ్నం – సాయంకాలాల్లో వాతావరణం ఎంతో విభిన్నంగా ఉంటుంది. కారణం.. భూమి ప్రయాణం (సూర్యుని స్థితిగతులు మారుతాయి). సాయం కాలానికి ఇంటికి దక్షిణ – పశ్చిమ – నైరుతిల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ స్థితిని మన శరీరంలోని జీవ గడియారం ఎంతో ఆకర్షిస్తుంది. తద్వారా మనఃస్థితి ఎంతో ఉత్సాహంగా ప్రఫుల్లితంగా ఉంటుంది. అందుకే శయన మందిరాలు (పడక గదులు) దక్షిణ – పశ్చిమాలలో నిర్మిస్తారు. తూర్పు – ఉత్తరం గదులు పెట్టి వాడుకోవద్దా? అనేది కాదు. శాస్త్రం దానికి సమ్మతించదు. అది వ్యవహార జీవనానికే ఎంతో సానుకూలం, కాబట్టి మూడు – నాలుగు.. ఎన్ని బెడ్రూములు కట్టినా, దక్షిణ – పడమర – వాయవ్య – నైరుతి దిశల్లో ప్లాన్ చేసుకోండి.
– ఇంద్రకుమార్, కాచిగూడ
గేటు మీద కప్పు లేకుండా.. పైన ఓపెన్ ఉండేలా పెట్టే గేట్లు ఎలా నిర్మించుకున్నా ఇబ్బందిలేదు. ఇంటి కాంపౌండుకు గేటు, దానికి ఇరువైపులా వచ్చే పిల్లర్లు (దిమ్మెలు) ఎలివేషన్‌లో భాగంగా చాలా అందంగా ఏర్పాటు చేసుకుంటారు. వాటిని ఎలా రూపొందించినా దోషం కాదు. అది మంచిదే. గోడకన్నా గేటు సహజంగా ఎత్తుగానే వస్తూ ఉంటుంది. గేటును (ఇనుప రెక్కలను) గోపురాకారంగా తయారుచేసినప్పుడు కాంపౌండు ఎత్తుకన్నా పైకి ఉండవచ్చు. అందంలో భాగమే అవుతుంది. పైగా అది వాడుక గేటు. కాబట్టి తప్పులేదు. ఎక్కడైనా ఇంటి ఫ్లోర్కన్నా గేట్లు ఎత్తుకావు. కాబట్టి, మీకు నచ్చిన గేటును, ఇంటికి తగిన గేటును అమర్చుకోండి. శుభం కలుగుతుంది.
– కె. రమేశ్, చౌటుప్పల్
తూర్పు సింహద్వారం పెడుతున్నప్పుడు ఒక ద్వారాన్ని మాత్రమే విడిగా ప్లాన్ చేస్తే.. ఇంటిలో నడక ఒకలా ఉంటుంది. రెండు పక్కల కిటికీలు పెట్టి, మధ్యలో ద్వారం పెడితే.. గది వినియోగం మరోలా ఉంటుంది. అలా పెట్టుకోవద్దు అనను కానీ, దానికి తగిన విధంగా.. పశ్చిమ వాయవ్యంలోని పడకగది ద్వారం ఎదురుగా వస్తుందా? లేదా, అనేది చూడాలి. పారుతప్పే అవకాశం ఉంటుంది. ఈశాన్యం గది వాడకం కూడా మారుతుంది. గదుల కొలతను బట్టి సరిగ్గా సెట్ చేసుకోండి. వరుస ద్వారాలు కలిసేట్టు చూసుకోండి. అంటే.. ఈశాన్యంలోని ద్వారానికి ఎదురుగా డ్రాయింగ్ పడమర ద్వారం, అలాగే వాయవ్య ద్వారం క్రమగతిలో వచ్చేట్టు చూసుకోండి. అందుకు తగిన సర్దుబాట్లు చేసుకొని ద్వార నిర్ణయం చేయండి. ఒక డోరుకు మరో డోరు పోటీ కావద్దు.
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.