మా స్థలానికి ఈశాన్యం దిశలో రోడ్డు కలుస్తూ ఉత్తరం మొత్తం లేకుండా పోయింది. అందులో ఇల్లు కట్టుకోవచ్చా? సిరికొండ వంశి, కొండపాక
కొన్ని స్థలాలకు ఎక్కడినుంచో వచ్చే రోడ్డు స్థలంతో పూర్తిగా కొనసాగకపోవచ్చు. కొంతమేర స్థలానికి తగులుతూ మిగతా భాగం క్రాస్‌గా వెళ్తుంటుంది. మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. మీరు పంపిన ‘నక్ష’ చూశాను. మీ స్థలానికి వాయవ్యంలో ఇతరుల స్థలం ఉంది. మీకు రోడ్డు అప్రోచ్ ఈశాన్యం నుంచి తప్ప ఉత్తరం నుంచి రాదు. ఆ రోడ్డు మీ స్థలం నుంచి వెళ్లడానికి అనుకూలంగా ఉంది. మీరు ఈశాన్యంలో గేటు పెట్టుకొని వాడుకోండి. స్థలమంతా రోడ్డు ఉంటేనే ఇల్లు కట్టాలని లేదు. మన ఇంటి గేటు పెట్టే స్థలం మొత్తానికి ఉన్నతమైన దిశనుంచి రాకపోకలు చేసే అవకాశం ఉందా లేదా అనేదే ప్రధానం. మీ స్థలంలో చక్కగా శాస్త్రబద్ధంగా ప్లాన్ వేసుకొని దిశానుకూలంగా ఇల్లు కట్టండి. ఈశాన్యం దారి వాడండి.
పిల్లర్ ఎలా ఉంటే ద్వారానికి పోటీ అవుతుంది?వి.సదానంద్, దామరచెర్ల
పిల్లర్ ప్రత్యేకంగా ఉండి, దానికి ఎదురుగా ద్వారం వచ్చినప్పుడు దానిని ‘పిల్లర్ కోణం పడుతుంది’ అంటారు. పిల్లర్‌కు ఒకవైపు గోడ ఉండి, ఒక దిక్కు కోణం వచ్చి ద్వారం సెంటర్లోకి పడినా అది దోషంగానే పరిగణించాల్సి ఉంటుంది. గోడలో పిల్లర్ కలిసి పోయినప్పుడు ఆ గోడకు ఎదురుగా ద్వారం వస్తే అది కోణం పడటంగా భావించొద్దు. పిల్లరే కాదు, లిఫ్ట్ మూల, గది మూల, పూజగది మూల, చెట్లు ఇవేవీ నడక ద్వారంలోకి తొంగి చూసినట్టుగా రాకూడదు. అది దోషంగా భావించాలి. ద్వారాలు సజావుగా, సాఫీగా సాగేలా వరుస ద్వారాలు ముందుగానే ప్లాన్ చేసుకొని కట్టుకోవాలి.
మా వ్యవసాయ స్థలంలో దక్షిణం నుంచి ఉత్తరం ఒర్రెలు ఉన్నాయి. అలా ఉండొచ్చా? పొలంలో ఇల్లు కట్టుకోవచ్చా? బొడిగ సత్యం, చాడ
‘స్థలం’ మనం సృష్టించింది కాదు. దాని సహజ లక్షణాలు దానికి ఉంటాయి. వాటిని క్రమబద్ధీకరించి మనకు అనుకూలంగా మార్చుకోవాలి. దక్షిణం నుంచి నీటి ప్రవాహం ఉంది అంటే, మీ వ్యవసాయ క్షేత్రం ఉత్తరం పల్లంతో ఉన్నట్టు. అప్పుడు మీరు దక్షిణం నుంచి ఉత్తరానికి ఒక రోడ్డు వేసుకొని ఆ దారికి తూర్పువైపు చిన్నగా సన్నని ‘నీటి కాలువ’ (ట్రెంచ్) కట్టండి. ఆ నీటిని అలాగే తీసుకొని ఉత్తరం, ఈశాన్యంలో ఒక పెద్ద సంపు కట్టి దానిలోకి మళ్లించండి. అందులో నుంచి నీటిని వాడుకోండి. సహజ సిద్ధంగా స్థలమంతా పరుచుకున్న నీళ్లను సక్రమంగా వచ్చేలా చేసినప్పుడు మిగతా క్షేత్రాన్ని మనం సాగు చేసుకోవచ్చు. అలాగే, మీ వ్యవసాయ క్షేత్రంలో నైరుతి భాగం ఎత్తు చేసుకొని ఇల్లు కట్టుకోవచ్చు.
ఇండిపెండెంట్ ‘ఇంటికి’ (విల్లా) సెల్లార్ ఉండవద్దా? మా ఇంటిని కార్యాలయంగా, ఇంటిగా వాడుతున్నాను? వడితల రామలింగయ్య
మీ గృహానికి రోడ్డు ఎటువైపు ఉన్నదో తెలుపలేదు. ఇల్లు అయినా, అపార్ట్మెంట్ అయినా తూర్పు రోడ్డు ఒకటి లేదా ఉత్తరం రోడ్డు ఒకటి ఉన్నప్పుడు దానికింద సెల్లార్ పనికిరాదు. ఇవాళ వాణిజ్యపరమైన భవనాలకు కార్ల పార్కింగ్ కోసం సెల్లార్ తప్పనిసరి అవుతున్నది. కానీ, గృహ సముదాయాల నిర్మాణాలకు తూర్పు, ఉత్తరం రోడ్డు ఉంటే సెల్లార్ ఇబ్బందులు పెడుతుంది. సౌకర్యం కన్నా సమస్య మంచిది కాదు కదా! ఇంటికి దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు లేదా పడమర వీధి ఉన్నప్పుడు అవసరం ఉంటే సంతోషంగా సెల్లార్ పెట్టుకోవచ్చు. దక్షిణం రోడ్డు స్థలానికి దక్షిణ-ఆగ్నేయం నుంచి సెల్లార్లోకి వెళ్లే విధంగా ర్యాంప్ ఇచ్చుకోవాలి. పడమర రోడ్డు ఉంటే పడమర వాయవ్యం నుంచి లోనికి వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి. పడమర వీధి, దక్షిణం వీధి ఉన్న ఇండ్లకు కూడా సెల్లార్ వర్తిస్తుంది.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678