పెళ్లి వేడుకలో వీడియో తీయడమంటే ఆషామాషీకాదు. కరెక్ట్ లైటింగ్, యాంగిల్తోపాటు సరైన దృక్పథం ఉండాలి. అందుకే చాలామంది ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మూలమూలకూ తిరుగుతూ మంచి మంచి ఫొటోలు క్యాప్చర్ చేస్తుంటారు. ఇటీవల కొందరు నేలపై పడుకొని, నీటిలో మునిగి, చెట్టెక్కి వింతవింతగా ఫొటోలు తీయడం చూసే ఉంటాం. తాజాగా, ఓ కుర్రాడు తన కెమెరాతో చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసినవారంతా నవ్వాపుకోలేకపోతున్నారు.
ఫంక్షన్లో ఓ బాలుడు కెమెరా పట్టుకుని నేలపై దొర్లుతూ వీడియో తీస్తుంటాడు. ఓసారి కిందికి వంగుతూ.. మరోసారి పైకి లేస్తూ వింతవింతగా ఫోన్ కెమెరా పట్టుకొని విన్యాసాలు చేస్తుంటాడు. స్టేజీపై డ్యాన్స్ చేస్తున్న అందరినీ కెమెరాలో బంధించేందుకు సర్కస్ ఫీట్లు వేస్తాడు. అతడిని చూసి అంతా నవ్వుకుంటున్నా వీడియోలు తీయడం ఆపడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కొంతమంది అతడి ప్రతిభను ప్రశంసిస్తుండగా, మరికొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.