చండీగఢ్: ఒక తల్లి తన కుమారుడ్ని బిల్డింగ్ పదవ అంతస్తు నుంచి ప్రమాదకరంగా కిందకు వేలాడదీసింది. ఒళ్లు జలదరింప జేసే ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఫరీదాబాద్ సెక్టార్ 82లోని రెసిడెన్షియల్ సొసైటీలో నివాసం ఉంటున్న ఒక మహిళ గత వారం తన కుమారుడ్ని రిస్క్‌లో పడేసింది. బిల్డింగ్ పదో అంతస్తులోని ఫ్లాట్ బాల్కానీలో ఆమె ఆరేసిన చీర కింద ఉన్న 9వ అంతస్తులోని బాల్కానీలో పడింది. అయితే ఆ ఫ్లాట్‌కు లాక్‌వేసి ఉంది.
దీంతో చీర కోసం ఆ మహిళ తన కుమారుడ్ని ప్రమాదంలో పడేసింది. బాలుడికి బెడ్‌షీట్ కట్టి పదో అంతస్తులోని వారి బాల్కానీ నుంచి కిందకు వేలాడదీసింది. 9వ అంతస్తు బాల్కానీలో దిగిన ఆ బాలుడు ఆ చీరను తీశాడు. అనంతరం బాలుడి తల్లితోపాటు కుటుంబ సభ్యులు అతడ్ని పైకి లాగారు. ఈ సందర్భంగా ఆ బాలుడు కొంతసేపు ఎత్తైన ఆ బిల్డింగ్‌పై వేలాడటంతో స్థానికులు ఆందోళన చెందారు.
కాగా, ఆ మహిళ లాక్ చేసి ఉన్న కింద ఫ్లాట్ బాల్కానీలో పడిన చీర కోసం సొసైటీ మేనేజ్మెంట్ లేదా మరెవరి సహాయం కోరలేదు. సొంత నిర్ణయం తీసుకుని తన కుమారుడ్ని ప్రమాదంలో పడేసింది. అతడికి బెడ్‌షీట్ కట్టి పదో అంతస్తు నుంచి కిందకు దించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సొసైటీ మేనేజ్మెంట్ ఆమెకు నోటీస్ జారీ చేసింది.
మరోవైపు ఎదురుగా ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో నివాసం ఉండే ఒక వ్యక్తి తన మొబైల్లో దీనిని రికార్డు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్లో ఈ వీడియోను రీషేర్ చేశారు. ఒక తల్లి తన కుమారుడ్ని రిస్క్‌లో పడేసిన వీడియో చూసి దిగ్భ్రాంతి చెందాను అని శీర్షిక పెట్టారు. నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శమని విమర్శించారు. తన బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టే హక్కు ఆమెకు లేదన్నారు. పలువురు నెటిజన్లు కూడా ఆ మహిళ చర్యను తప్పుపట్టారు.
Appalled to see this video of a mother from #Faridabad!
Heights of carelessness, insensitivity & irresponsibility.
She has no right to risk her kid's life. pic.twitter.com/uNj362e9UO— Dipanshu Kabra (@ipskabra) February 11, 2022