సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల భిన్నమైన ఫోటోలు స్లైడ్‌షో పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో ఫోటో డంప్ అని రాస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో ఫోటో ట్రెండ్ సోషల్ మీడియాలో తాజా ట్రెండ్‌గా ముందుకొచ్చింది. ఉదాహరణకు మీరు ఔటింగ్‌కు వెళ్లినప్పుడు ఒక ఫోటోను పోస్ట్ చేయకుండా మీరు సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, కొత్త డ్రెస్‌లో ముస్తాబైన..లేదా రుచికరమైన విందు భోజనం ఆరగిస్తూ ఇలా పలు రకాల ఫోటోలను మిక్స్ చేసి ఒకే పోస్ట్‌లో ఇవ్వడం ఫోటో డంప్ ప్రత్యేకత. లాక్‌డౌన్‌తో పార్టీలు లేకపోవడం, స్నేహితులతో ఎంజాయ్ చేయడం కుదరకపోవడంతో సోషల్ మీడియాలో ఫోటో డంప్ వైవిధ్యమైన, కలర్‌ఫుల్ లైఫ్‌లోని భంగిమలను ఆవిష్కరించడం ఆకట్టుకుంటోంది.
ఇక సెలెబ్రిటీలు ఫోటో డంప్ పేరుతో భిన్నమైన ఫోటోలతో ఇన్‌స్టా వేదికపై హొయలొలికిస్తున్నారు. సూపర్ మోడల్ బెల్లా హదిద్ తరచూ తన ర్యాండమ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికపై పంచుకుంటూ మెరిపిస్తున్నారు. హాలీవుడ్ నటి కైలీ జెన్నర్ సైతం తన జీవితంలోని ఎన్నో ఘట్టాలను ఇన్‌స్టా తెరపై పరిచేస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన వెకేషన్‌కు సంబంధించిన పలు ఫోటోలను వైల్డ్‌ఫ్లవర్ వైల్డ్‌ఫైర్ క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మరో ఇన్‌స్టా యూజర్ మెట్రిజ్ తన ఔటింగ్ ఫోటోలను మ్యూజియం ఫోటో డంప్ పేరుతో పోస్ట్ చేశారు. ఇక నైనా సింగ్ ఇటీవల తన బాత్రూం సెల్ఫీలతో ఫోటో డంప్‌ను పోస్ట్ చేశారు. నెగెటివిటీకి ఎంత తక్కువగా స్పందిస్తే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుందని ఆమె ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా రాసుకొచ్చారు.