Viral News | మందులోకి ఆమ్లెట్, చిప్స్, చికెన్ తదితర వాటిని మంచింగ్‌గా తీసుకుంటుంటారు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏకంగా కుక్క చెవులు, తోకను మంచింగ్‌గా తీసుకున్నారు. అదేంటి మందులోకి మంచిగ్గా కుక్క చెవులు, తోక ఏంటి..? అని అనుకుంటున్నారు కదూ..! మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బరేలీ జిల్లా ఫరీద్పూర్ ప్రాంతంలోని ఎస్డీఎం కాలనీకి చెందిన ముఖేష్ వాల్మీకి, మరో వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించారు. మద్యం మత్తులోనే వారు రెండు కుక్కలను పట్టుకుని ఒక కుక్క రెండు చెవులు, మరో కుక్క తోకని కట్ చేశారు. అనంతరం వాటికి ఉప్పు, కారం దట్టించి మందులోకి మంచింగ్ చేసుకున్నారు. ఇది గమనించిన ధీరజ్ పతాక్ అనే వ్యక్తి సదరు వ్యక్తులపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి దాడిలో రెండు కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి అఖిలేష్ చౌరాసియా తెలిపారు.