Tourism | పర్యటనలే మనిషిని పరిపూర్ణుడిని చేస్తాయి. ‘ఓ ఏడాది గడిచిపోయే సరికి… ఇంతకుముందు చూడని ప్రదేశానికి వెళ్లిరావాలి’ అంటారు బౌద్ధ గురువు దలైలామా. ఇంటినుంచి అడుగు బయట పెట్టకపోతే మాత్రం ఉన్నచోటనే ఉండిపోతాం. అదే కొత్త ప్రదేశాలను చుట్టేసి వస్తే కొత్త అనుభూతులు, సరికొత్త అనుభవాలు పోగేసుకుంటాం. మనసు విశాలమవుతుంది. ఇలాంటి దర్శనీయ స్థలాలు ప్రపంచంలో చాలానే ఉంటాయి. వాటిలోంచి ఈ ఏడాది సందర్శించాల్సిన 25 అత్యుత్తమ ప్రదేశాలను సిఫారసు చేస్తున్నారు పర్యాటక నిపుణులు. మనం ఎంచుకునే చోటును బట్టి, మన జీవనశైలిని బట్టి వ్యయాలు మారుతూ ఉంటాయి.
…? చింతలపల్లి హర్షవర్ధన్
నెగొంబో, శ్రీలంక
శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని సముద్రతీర నగరం నెగొంబో. బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోనే ఉంటుంది. సముద్రపు కయ్య (లగూన్)ను అనుసరించుకుని ఉన్న నెగొంబో శ్రీలంకలో పురాతనమైన చేపల పరిశ్రమకు నెలవైన నగరం. ఇక్కడి బీచ్ ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం మీద మత్స్యకారులు చేపల్ని వేటాడే దృశ్యాలు కట్టిపడేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సముద్రంలో మునిగిపోయిన బ్రిటిష్ సరుకు రవాణా విమానాన్ని చూడటానికి డైవింగ్ సదుపాయం ఉంటుంది. తీర ప్రాంతంలో మడ అడవులు ప్రత్యేక ఆకర్షణ. వీటిని చూడటానికి పడవ సదుపాయం ఉంది. అలా వెళ్తూ వెళ్తూ నీటి ఉడుములు, వలస పక్షులను చూసి పరవశించిపోవచ్చు. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మున్నేశ్వరం దేవాలయం, స్థానికంగా ఉండే చేపల మార్కెట్ కూడా దర్శనీయమే. ఇక్కడి పెద్దపెద్ద హోటళ్లు విండ్ సర్ఫింగ్, సెయిలింగ్, స్కీయింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తుండటం విశేషం.
కోహ్ కేర్, కాంబోడియా
కాంబోడియా దేశంలోని పవిత్ర నగరం. నాలుగున్నర చదరపు మైళ్ల విస్తీర్ణంలో నెలకొన్న దేవాలయాల సముదాయమే కోహ్ కేర్. ప్రసాత్ థామ్ అనే ఏడంతస్తుల పిరమిడ్ ఇక్కడి ప్రసిద్ధ నిర్మాణం. రకరకాల శిల్పాలు, రాతి చెక్కడాలు, కొలనులు, పురాతన నిర్మాణాలతో పెనవేసుకుని భారీగా పెరిగిపోయిన చెట్లు ప్రధాన ఆకర్షణ. దగ్గరి విమానాశ్రయం సియెమ్ రీప్.
ముస్తాంగ్, నేపాల్
నేపాల్ హిమాలయ దేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ముస్తాంగ్ ప్రాంతం చూపు తిప్పుకోనివ్వని అన్నపూర్ణ, ధవళగిరి హిమగిరులు, పర్వతాల మధ్య మలుపులు తిరుగుతూ లోయల్లో హొయలొలికే నదులు, మంచుకొండల నుంచి నెమ్మదిగా జాలువారుతున్న హిమనదాలు, ఎత్తుపల్లాలతో కూడుకున్న లోయలు, జడలబర్రెలు, గొర్రెలతో ముస్తాంగ్ ప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. మనదేశానికి పొరుగునే ఉండే నేపాల్‌లో పర్యటన సులభమే.
అల్మాటీ, కజక్‌స్తాన్
మధ్య ఆసియా దేశం కజక్‌స్తాన్‌లో అతిపెద్ద నగరం. పురాతనమైన సిల్క్రోడ్లో వెలసిన అల్మాటీ కజక్‌స్తాన్‌లో అత్యంత అందమైన నగరం. ట్రాన్స్ ఇలి ఆల్టాయ్ పర్వతాల నేపథ్యంతో ఉండే అల్మాటీ మంచి ప్రణాళికతో, దారికి రెండువైపులా చెట్లతో కూడిన రోడ్లు, లెక్కలేనన్ని పార్కులు, తోటలతో సందర్శకులకు మధురానుభూతులను అందిస్తుంది. ఇక్కడి అసెన్షన్ కేథడ్రెల్ ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తయిన కొయ్య కట్టడం. దీన్ని 1907లో నిర్మించారు.
డొమినికా
కరీబియన్ దీవుల్లో కొలువైన 750 చదరపు కిలోమీటర్ల దేశం డొమినికా. అగ్నిపర్వతాలు, ఉష్ణమండల వర్షారణ్యాలు, అంతెత్తునుంచి జాలువారే జలపాతాలు ఇక్కడి ఆకర్షణ. అందుకే దీన్ని ‘ప్రకృతి ద్వీపం’ (నేచర్ ఐలాండ్) అని పిలుచుకుంటారు. దట్టమైన అడవులు, అందమైన రోజో లోయ, దాదాపు 200 అడుగుల వెడల్పుతో.. పొగలుకక్కుతూ మరిగే నీటి సరస్సు సందర్శనీయ స్థలాలు.
మసా అండ్ కరారా, ఇటలీ
కళా ప్రేమికులకు స్వర్గధామం ఇటలీలోని మసా అండ్ కరారా ప్రావిన్స్. మన హిమాలయాలను తలపించే అపువన్ ఆల్ప్స్ పర్వతాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ప్రపంచ ప్రసిద్ధ పాలరాతి గనులు ఇక్కడే ఉన్నాయి. మైఖేలాంజిలో రూపొందించిన సుప్రసిద్ధ శిల్పం డేవిడ్ ఇక్కడి పాలరాతితో తీర్చిదిద్దిందే. రోడ్డు వారగా శిల్పుల ఉలి సవ్వళ్లు వినిపించడం మసా అండ్ కరారా విలక్షణత. ఆల్ప్స్ పర్వతాలకు తోడు మధ్యధరా సముద్రతీర బీచ్‌లు, భారీతనం ఉట్టిపడే క్రైస్తవ కేథడ్రెల్లు, మధ్యయుగాల ఐరోపా చరిత్రను గుర్తుకుతెచ్చే కోటలకు మసా అండ్ కరారా పెట్టింది పేరు.
లద్దాక్, భారత్
హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్తాంగ్ కనుమ మీదుగా అటల్ టన్నెల్ గుండా సాగిపోతే కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్ చేరుకుంటాం. ఆకాశాన్ని అందుకునే హిమాలయాలు, పాతాళాన్ని తాకే పర్వత లోయలు, సింధు, ష్యోక్ నదుల ఒయ్యారపు మలుపులు, బౌద్ధ మఠాలు, జడలబర్రెలు, కొండగొర్రెలు, నల్లమెడ కొంగలు, స్వచ్ఛమైన సరస్సులు లద్దాక్ ఆకర్షణలు. ఇక్కడి పెద్ద పట్టణమైన లేహ్‌లో మార్కెట్లు, మ్యూజియంలు, తొమ్మిది అంతస్తుల రాజభవనం చూడదగిన ప్రదేశాలు.
బ్రెసీలియా, బ్రెజిల్
దక్షిణ అమెరికా ఖండంలో పెద్దదేశం బ్రెజిల్ రాజధాని నగరం బ్రెసీలియా. ప్రణాళికా బద్ధంగా నిర్మించిన ఈ నగరం అధునాతనమైన తెల్లటి భవంతులకు తార్కాణం. బ్రెజిల్ దేశపు అధ్యక్షుడి నివాసం పలాసియో డ అల్వొరడా కొత్త రూపాన్ని సంతరించుకుని ఈ ఏడాది మళ్లీ ప్రారంభం కానుంది. ఆధునిక నగర ప్రణాళికకు నమూనాగా నిలిచే బ్రెసీలియా నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటు దక్కింది.
యమగూచి, జపాన్
స్వచ్ఛమైన ఉద్యానవనాలు, ఐదు అంతస్తుల రూరికోజీ ఆలయ పగోడాకు ప్రసిద్ధి చెందిన నగరం యమగూచి. వందల ఏండ్ల చరిత్ర కలిగిన బౌద్ధ మందిరం రూరికోజి పగోడాను జపాన్ జాతీయ సంపదల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక నగరంలోని మలుపులు మలుపుల వీధులు యుద్ధ వ్యూహాన్ని అనుభూతికి తెస్తాయి.
న్యూజిలాండ్
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉన్న దేశం న్యూజిలాండ్. ఉత్తర, దక్షిణ న్యూజిలాండ్ ప్రధాన దీవులు కాగా, చిన్నచిన్న దీవులు అనేకం ఉన్నాయి. క్రియాశీల అగ్నిపర్వతాలు, చూపు తిప్పుకోనివ్వని గుహలు, హిమనదాలతో ఏర్పడిన లోతైన సరస్సులు, అందమైన లోయలు, పొడవైన బీచ్‌లు, మంచుతో కప్పి ఉండే ఎత్తయిన పర్వతాలకు నిలయం ఈ దేశం. కివీ పక్షులు మరో ఆకర్షణ. న్యూజిలాండ్‌ను రోడ్డు ద్వారా వెళ్తూ చూడాలని పర్యాటకులు కోరుకుంటారు. కానీ రైలులో చుట్టేయడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇలా న్యూజిలాండ్‌ను తిరగడానికి 17 రోజులు పడుతుంది.
మావుయీ, అమెరికా
అమెరికాకు చెందిన హవాయీ దీవుల్లో భాగమే ఈ మావుయీ ద్వీపం. పసిఫిక్ మహాసముద్రం ఓ వైపు.. కాలుష్యం జాడలు లేని స్వచ్ఛమైన బీచ్‌లు, కొబ్బరిచెట్లు, ఎత్తయిన పర్వతాలతో కూడిన 700 చదరపు కిలోమీటర్ల ద్వీపం ఇది. హాలియాకలా నేషనల్ పార్క్ ప్రత్యేక ఆకర్షణ. ఇక కామావుల్ స్టేట్ బీచ్‌లో ముఖానికి స్నార్కెల్ పెట్టుకొని సముద్ర గర్భాన్ని చూస్తూ ఈదులాడొచ్చు. బీచ్‌లో సేదదీరుతూ సముద్ర తాబేళ్లను చూస్తూ అవ్యక్తమైన ఆనందానుభూతికి లోనుకావొచ్చు.
మోనార్క్ బటర్‌ఫ్లై బయోస్పియర్ రిజర్వ్, మెక్సికో
ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో సుమారు 1,40,000 ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంతం.. మోనార్క్ బటర్‌ఫ్లై బయోస్పియర్ రిజర్వ్. శిశిరం వచ్చిందంటే సరి.. బహుదూరాల నుంచి వలసవచ్చిన కోట్లాది మోనార్క్ జాతి సీతాకోకచిలుకలు ఈ పార్కులో సందడిచేస్తాయి. ఈ వలస కాలంలోనే సీతాకోకచిలుకలు నాలుగు తరాలు పుట్టి మరణిస్తాయట. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ బయోస్పియర్ రిజర్వ్ మెక్సికో నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
తెస్సాలోనికి, గ్రీస్
గ్రీస్ దేశంలో ఏజియన్ సముద్ర తీరంలో ఉన్న ఈ నగరం పర్యాటక ప్రియులు అత్యధికంగా తరలివచ్చే ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ‘గ్రీకువీరుడు’ అలెగ్జాండర్ ద గ్రేట్ సోదరి తెస్సాలోనికె పేరుమీదుగా ఆమె భర్త కసాండర్ ఆఫ్ మాసిడోన్ స్థాపించాడు. ప్రాచీన గ్రీకుల కాలపు కట్టడాలు, బైజాంటైన్ సామ్రాజ్యం మొజాయిక్ చిత్రాలు, ఒట్టోమాన్ తురుష్కుల కాలపు కట్టడాలతో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక లక్షణాలతో అలరారుతున్న నగరం తెస్సాలోనికి.
సింగపూర్
ఆసియా ఖండానికి చెందిన నగర దేశం సింగపూర్ నిజంగానే పర్యాటకుల స్వర్గధామం. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే మలక్కా జలసంధి ప్రాంతంలో భూమధ్య రేఖ సమీపంలో నెలకొన్న సింగపూర్‌లో… మెరీనా బే బీచ్ ఇసుకతిన్నెలు, కళ్లు చెదరగొట్టే ఉద్యానవనాలు, కోలాహలంగా ఉండే ఆర్చర్డ్ రోడ్, మండాయ్ అభయారణ్యంలోని పక్షుల పార్కు, పులావు సెంటోసా ద్వీపాలు, సింగపూర్ నేషనల్ మ్యూజియం, ప్రపంచంలోనే అత్యంత అరుదైన మాంగ్రూవ్ అడవులకు నిలయమైన సుంగేయి బులోహ్ వెట్లాండ్ అభయారణ్యం ప్రధాన సందర్శన స్థలాలు.
జెనీవా, స్విట్జర్లాండ్
ప్రకృతి అందాల దేశం స్విట్జర్లాండ్‌లో రెండో పెద్ద నగరం జెనీవా. అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ నగరం కేంద్రంగా పనిచేస్తున్నాయి. చాక్లెట్లు, గడియారాలకు జెనీవా ప్రసిద్ధి. ఇక్కడ జెట్ డిఈఎయూ ఫౌంటెయిన్, పూల గడియారం ఎల్హార్లోగ్ ఫ్లూరీ, సెయింట్ పియర్ కేథడ్రెల్, ప్లేస్ డ్యు బోర్గ్డిఫోర్ తదితర ప్రదేశాలు దర్శనీయాలు. ఇక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీఈఆర్ఎన్ పరిశోధన కేంద్రం ప్రధాన ఆకర్షణ.
పారిస్, ఫ్రాన్స్
ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్ ఫ్యాషన్‌కు, ఈఫిల్ టవర్‌కు పేరుగాంచింది. 2024 ఒలింపిక్స్, పారాలింపిక్ ఆటలపోటీలకు
ఈ నగరం ఆతిథ్యం ఇస్తున్నది. ఈఫిల్ టవర్‌తోపాటు నోటర్ డామ్ కేథడ్రెల్, లోవర్ మ్యూజియం, ఢిల్లీలోని ఇండియా గేట్‌ను పోలినఆర్క్ ఆఫ్ ట్రయంఫ్, వర్సెయిల్స్ రాజభవనం, డిస్నీలాండ్ చూడదగ్గ స్థలాలు. సీన్ నదిపై నౌకా విహారం అదనపు ఆకర్షణ.
బ్రూనీ ఐలాండ్, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా టాస్మేనియా రాష్ట్రంలో పసిఫిక్ మహాసముద్రంలో నెలవైన ద్వీపం బ్రూనీ ఐలాండ్. ఉత్తర, దక్షిణ బ్రూనీ భూభాగాలను కలిపే ఇరుకైన భూసంధి ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కుడిఎడమలుగా విస్తరించిన సముద్రం మధ్య రోడ్డు ప్రయాణం ఓ వర్ణించలేని అనుభూతి. ఈ ద్వీపాన్ని మొదటగా 1642లో నెదర్లాండ్స్ నావికుడు ఏబెల్ టాస్మాన్ గుర్తించాడు. గార్డెన్ సీడ్ బ్యాంక్‌లో విత్తనాలు సేకరించవచ్చు. దీనికోసం టాస్మేనియన్ వాకింగ్ కంపెనీ, రాయల్ టాస్మేనియన్ బొటానికల్ గార్డెన్ ఉమ్మడిగా వృక్షశాస్త్ర విజ్ఞానం పెంచుకునేందుకు మూడు రోజుల ట్రెకింగ్ సదుపాయం కల్పించాయి.
లేక్ టోబా, ఇండోనేషియా
ఇండోనేషియా దేశం సుమత్రాలో 1,707 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన అగ్నిపర్వత సరస్సు లేక్ టోబా. సరస్సు మధ్యలో పులావు సామోసిర్ ద్వీపం ఉంటుంది. సుమారు 70,000 సంవత్సరాల కింద అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఈ సరస్సు ఏర్పడింది. పులావు సామోసిర్ బతక్ తెగ ఆదివాసుల సాంస్కృతిక కేంద్రం. కొన్ని రోజులపాటు అడవిలో అలా ప్రశాంతంగా తిరిగి రావాలనుకునే వారికి గొప్ప పర్యాటక ప్రదేశం లేక్ టోబా. అయితే, సరస్సులో నీటి నాణ్యత ఒక్కో దగ్గర ఒకోలా ఉంటుంది. స్థానికులను అడిగి అనువైన చోట మాత్రమే లోపలికి అడుగుపెట్టాలి. ఈ సరస్సులోని నీరు అసహన్ నది గుండా మలక్కా జలసంధిలో కలిసిపోతుంది.
సావో నేషనల్ పార్క్, కెన్యా
ఆఫ్రికా ఖండ దేశం కెన్యాలో 22,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన అభయారణ్యం సావో నేషనల్ పార్క్. ప్రపంచంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనాల్లో ఇది ఒకటి. ఆఫ్రికా ఏనుగులు, సింహాలు, వివిధ రకాల కోతులు, అడవి దున్నలు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, హార్టెబీస్ట్ అనే జింకలు, జిరాఫీలు, జీబ్రాలు, వందలాది పక్షిజాతులతో సావో నేషనల్ పార్క్ సందర్శకులకు కనువిందు చేస్తుంది.
పాసాడెనా, అమెరికా
కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజెల్స్ కౌంటీలో కొలువైన నగరం పాసాడెనా. సెయింట్ గాబ్రియెల్ పర్వతాల నేపథ్యంతో ఈ నగరం చూడముచ్చటగా ఉంటుంది. దీన్ని 1874లో థామస్ బి. ఇలియట్ స్థాపించాడు. పాసాడెనా అంటే ‘లోయకు కిరీటం’ అని అర్థం. చుట్టుపక్కల ఉన్న జలపాతాలు, ఏంజెలిస్ నేషనల్ పార్కు పాసాడెనాకు ప్రత్యేక ఆకర్షణలు.
బాజ్ ఎన్వావ్జో ఇటా కుక్వేని, అమెరికా
అరిజోనా రాష్ట్రంలో భౌగోళిక అద్భుతం గ్రాండ్ కాన్యాన్ పరిసరాల్లో నెలకొంది. దీన్ని గత ఏడాది ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ స్మారకంగా ప్రకటించారు. తొమ్మిది లక్షల ఎకరాల్లో విస్తరించిన బాజ్ ఎన్వావ్జో పీఠభూములు, కాన్యాన్లు, ఇతర భౌగోళిక అద్భుతాలతో వావ్ అనిపిస్తుంది. 3,000 వరకు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న స్థలాలు దీని సొంతం. ఆధ్యాత్మికంగానూ ప్రాధాన్యం కలిగిందే. సిందూరపు రంగు పర్వత భాగాలు, ఇతర వన్యప్రాణులు కనువిందు చేస్తాయి.
వాలెన్షియా, స్పెయిన్
స్పెయిన్‌లో మధ్యధరా సముద్ర తీరంలో నెలకొన్న నగరం. 2,100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన నగరం వాలెన్షియా. ద సిటీ ఆఫ్ హండ్రెడ్ బెల్ టవర్స్ అని ఈ నగరానికి మారుపేరు. ఈ స్తంభాలలో మిగులెటె టవర్, టవర్ ఆఫ్ సాంటా కాటలినా ప్రసిద్ధిచెందినవి. నగరం మధ్యలో ఉన్న లా సియో కేథడ్రెల్ కూడా సందర్శనీయ స్థలమే. మధ్యయుగాలకు చెందిన వాలెన్షియా రాజుల కట్టడాలు ఆశ్చర్యపరుస్తాయి. ఎన్నో ఉద్యానవనాలు, ఆర్ట్ మ్యూజియంలు, సిరామిక్స్కు వాలెన్షియా పెట్టిందిపేరు. కన్ను ఆకారంలో ఉండే ఎల్హెమిస్ఫెరిక్, నీళ్లలో ఉండే ఎల్ఓషనోగ్రఫిక్ సిటీ కూడా చూడదగినవే. నడుస్తూనే వాలెన్షియాను చుట్టేయవచ్చు.
సాలార్ డి ఉయుని, బొలీవియా
దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో ఆండీస్ పర్వతాల్లో 12,000 అడుగుల ఎత్తులో నెలకొన్న ఉప్పు నీటి సరస్సు సాలార్ డి ఉయుని. ఆల్టిట్యూడ్ సిక్నెస్కు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న సాలార్ డి ఉయునికి ప్రయాణించడం సాహసమే. పురాతన సరస్సులు ఎండిపోవడంతో కేవలం లవణాలు మాత్రమే మిగిలిపోయిన నేల ఇది. 10,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన తెల్లటి ఉప్పునేల మీద సర్‌సర్‌మని మన అడుగుల సవ్వడి తప్ప మరే శబ్దం వినిపించదు.
ఔరికా లోయ, మొరాకో
మధ్యధరా, అట్లాంటిక్ మహాసముద్రాల్ని ఆనుకుని ఉన్న మొరాకో దేశంలో అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. వీటిలోభాగమే ఔరికా లోయ. ఎత్తయిన అట్లాస్ పర్వతాల మధ్య మలుపులు తిరిగే ఔరికా నది వల్లే ఈ ప్రాంతానికి ఈ పేరు. సెట్టి – ఫత్మా అనే గ్రామం దగ్గర్లో.. ఏడు జలపాతాల కలయికగా ఔరికా జలపాతాలు ఉంటాయి. సంప్రదాయ అమాజిగ్ ఇండ్లు కూడా సందర్శనీయ స్థలాలే.
క్రేటర్స్ ఆఫ్ మూన్, అమెరికా
అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో అగ్నిపర్వత పేలుళ్లు, లావా ప్రవాహం వల్ల ప్రత్యేకతను సంతరించుకున్న ప్రాంతం. దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో విస్తరించిన క్రేటర్స్ ఆఫ్ మూన్‌ను అమెరికా ప్రభుత్వం 1924లో జాతీయ ప్రాధాన్యంగల ప్రాంతంగా ప్రకటించింది. అగ్నిపర్వత పేలుళ్ల వల్ల ఏర్పడిన ఎగుడు దిగుళ్లతో ఈ ప్రాంతం అచ్చంగా చందమామ ఉపరితలాన్ని గుర్తుకుతెస్తుంది. అందుకే ‘క్రేటర్స్ ఆఫ్ మూన్’ అని పేరుపెట్టారు. లావా ప్రవాహం గడ్డకట్టి ఉంటుంది కాబట్టి, ఇక్కడ వృక్షాలు అంతగా కనిపించవు. వర్షపాతం కూడా తక్కువే. అయినా, లావాతో గట్టిపడిన పగుళ్లలో నీళ్లు నిల్వ ఉంటాయి. స్నేక్ నది ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది.