లండన్, ఏప్రిల్ 9: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూశారు. ఫిలిప్ శుక్రవారం ఉదయం విండ్సన్ కోటలో చనిపోయినట్టు రాజకుటుంబీకుల నివాసమైన బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. ఆయన వయస్సు 99 ఏండ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 16న గుండె సంబంధిత వ్యాధితో కింగ్ ఎడ్వర్డ్ దవాఖానలో చేరి 28 రోజుల పాటు చికిత్స తీసుకొన్నారు. మార్చి 16న డిశ్చార్జి అయ్యారు. ఫిలిప్‌ను డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో అని కూడా పిలుస్తారు. ఆయన 1921 జూన్ 10న గ్రీక్ రాజకుటుంబంలో జన్మించాడు. 1947లో ఎలిజబెత్‌ను పెండ్లి చేసుకొన్నారు. తరువాత ఐదేండ్లకు ఎలిజబెత్ రాణి అయ్యారు. కరోనా నేపథ్యంలో ఫిలిప్, రాణి కొంతకాలంగా విండ్సర్ కోటలోనే ఉంటున్నారు.