Telangana | హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో జర్నలిస్టులకు కూడా స్వాతంత్య్రం లేకుండా పోయింది. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150 మంది వారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీకార్డులు లాక్కున్నారు. పట్టపగలు సినిమాల్లోని వీధి గూండాలను తలపించారు. ఇంత జరిగాక, విషయం పోలీస్ స్టేషన్‌కు చేరాక కూడా వారిపై వేధింపులు ఆగలేదు. పోలీస్ స్టేషన్లోనే ఒకడు జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినా పోలీసులు చోద్యం చూశారు.
ఇద్దరు మహిళలు, అందునా జర్నలిస్టులు. చుట్టూ 150 మంది యువకులు. ఒకడు వాళ్ల దగ్గర ఉన్న ఫోన్ లాగుతాడు. మరొకడు కెమెరా, చిప్‌లను గుంజుకుంటాడు. ఇంకొందరు వాళ్లను తోసివేయడం.. బైక్‌లపై మరో పదిమంది వాళ్లను రౌండప్ చేయడం. వెకిలి చేష్టలతో కొందరు ఆ మహిళలను వేధించడం. యువకులు లాక్కున్న మైకులు, ఫోన్ కోసం మహిళలు ప్రయత్నిస్తే ఒకడి చేతిలో నుంచి ఒకడి చేతిలోకి విసిరేసుకోవడం. దీంతో వారు అటూ.. ఇటూ ఫోన్, కెమెరాల కోసం పరిగెత్తడం. చివరకు బైక్‌లపై ఉన్న యువకులు ఆ మహిళలను బురదలోకి నెట్టడం..’ ఇదంతా ఏదో సినిమాలో జరిగిన సంఘటన కాదు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో జరిగిందీ ఘటన. ఆయన ఇంటి ముందు జరిగిన తతంగం. రాష్ట్రంలో రైతులందరికీ రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామంటూ ఆర్భాటపు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి అనేక సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి స్వగ్రామంలో పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన మహిళా జర్నలిస్టులు గురువారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లెకు వెళ్లారు. ఉదయం ఆరుగంటలకే హైదరాబాద్ నుంచి వేర్వేరుగా బయల్దేరిన ‘తెలుగు ్రైస్కెబ్’ అనే వార్తా సంస్థ కంటెంట్ హెడ్ ఆవుల సరిత, ‘మిర్రర్’ వార్తా సంస్థకు చెందిన విజయారెడ్డి ఉదయం 9 గంటలకల్లా కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు. వారు ఎవరికి వారు స్థానికంగా ఉన్న రైతులు, మహిళా రైతులతో మాట్లాడుతున్నారు. స్థానిక దేవాలయం వద్ద, హోటల్ వద్ద ఉన్న పెద్దవాళ్లను పలకరిస్తూ అక్కడ పంటలు పండుతున్న తీరు, స్థానికంగా ఉన్న నీటి వసతి, పంటల రకాల గురించి తొలుత మాట్లాడారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ గురించి రైతుల వద్ద ప్రస్తావించి వారి అభిప్రాయలను సేకరించారు.
ఉదయం 9 గంటలకు కొండారెడ్డిపల్లిలో రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టిన సరిత, విజయారెడ్డి బృందానికి అనూహ్యమైన సమాధానాలు వచ్చాయి. తమ గ్రామంలో అత్యధిక మంది రైతులకు కల్వకుర్తిలోని ఎస్బీఐలో రుణఖాతాలున్నాయని, 1100 మందికి ఖాతాలుంటే కేవలం 300-350 మందికే రుణాలు మాఫీ అయినట్టు పాలకేంద్రం వద్ద ఉన్న రైతులు చెప్పారు. తనకు రూ. 60వేలు రుణం ఉన్నదని, అది కూడా మాఫీ కాలేదని ఒక రైతు చెప్పగా, తమలో చాలా మందికి మాఫీనే కాలేదని మరో ఇద్దరు చెప్పారు. అక్కడ 12 మందితో జర్నలిస్టుల బృందం మాట్లాడితే ఒకరికే మాఫీ అయిందని చెప్పారు.
ఈ సందర్భంగా ఓ రైతు స్పందిస్తూ తమకు రుణమాఫీ కాలేదని అయితే, ఆ విషయం చెప్తే కొట్టి సంపేస్తారని భయపడుతూ చెప్పాడు. ఎవరు కొట్టిసంపుతరు అని అడిగితే, అమ్మో నేను చెప్పలేను అంటూ ఆయన వెళ్లిపోవడం గ్రామంలోని పరిస్థితికి అద్దంపడుతున్నది. పాల కేంద్రం నుంచి అలా నడుచుకుంటూ జర్నలిస్టుల బృందం అక్కడ గుడివద్ద, అక్కడి నుంచి అటే పంచాయతీ ఆఫీసు వద్దకు చేరుకున్నది. అక్కడే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా ఉన్నది.
రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న పంచాయతీ కార్యాలయం సమీపంలోకి వెళ్తున్న సరిత, విజయారెడ్డి బృందానికి అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. కొందరు యువకులు వచ్చి తమ గ్రామానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తీసుకునేందుకు వచ్చామని జర్నలిస్టులు బదులిచ్చారు. రుణమాఫీపై అభిప్రాయాలన్నీ ఏకపక్షంగా ఉన్నాయని, మాఫీ కానివారి వద్ద మాత్రమే తీసుకున్నారని ఆ యువకులు ఆరోపించారు. అదేమీలేదు గ్రామంలోని రైతులందరినీ అడుగుతున్నామని, మాఫీ అయితే అయిందని చెప్తారని, తమకు గ్రామంలోని వారు తెలియదు కదా జర్నలిస్టులు బదులిచ్చారు. పొద్దున్నుంచి మీరు మా వెంట ఎందుకు పడ్డారని ప్రశ్నించారు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు. ‘ఇది మా ఊరు. మా ఇష్టం. ఎక్కడికైనా వస్తాం’ అని సమాధానమిచ్చారు. దీనికి స్పందిస్తూ సరిత, విజయరెడ్డి స్పందిస్తూ ‘మేం జర్నలిస్టులం. మా ఉద్యోగం మేం చేస్తున్నాం. రాజ్యాంగం మాకు కూడా హక్కు ఇచ్చింది. మాకు కూడా రైట్ ఉంది. వచ్చినం. మీరు హైదరాబాద్ వస్త లేరా.. పక్క ఊర్లకు పోతలేరా” అని ప్రశ్నించారు.
వంగూరు పోలీసు స్టేషన్లో మహిళా జర్నలిస్టులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. వారిదే తప్పన్నట్టుగా పోలీసులు మాట్లాడారు. జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అసలు మీరెందుకు కొండారెడ్డిపల్ల్లెకు వెళ్లారని ఎస్ఐ ప్రశ్నించారు. మీకు కావాల్సింది ఫోను, కెమెరాలే కదా అని చెప్పి కొద్దిసేపు అక్కడ వారిని కూర్చోబెట్టి ఫోను తెచ్చి ఇచ్చారు. ఫోను మా నుంచి ఎత్తుకెళ్లడం నేరం కదా.. మీకు ఎవరు తెచ్చి ఇచ్చారు.. వాళ్లపై కేసు పెట్టారా అని అడిగితే పోలీసుల నుంచి సమాధానం లేదు. ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అని పట్టుపడితే ఫిర్యాదు తీసుకున్నట్టు ఒక అక్నాలడ్జ్మెంట్ ఇచ్చి పంపించేశారు. కొండారెడ్డిపల్లిలో తమపై దాడిచేసి, తమ విధులకు ఆటంకం కలిగించి, తమపట్ల అసభ్యంగా ప్రవర్తించి, తమను దూషించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయానికి అక్కడకు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా వచ్చారు. ఆయన జర్నలిస్టులకు తమ మద్దతు తెలిపి తనకు పార్టీ కార్యక్రమం ఉన్నదని వెళ్లిపోయారు. అప్పటికే మధ్యాహ్నం దాటడంతో జర్నలిస్టులు కూడా కల్వకుర్తి వెళ్లి భోజనం చేశారు.
కల్వకుర్తిలో భోజనం చేసిన తర్వాత వంగూరు వెళ్లి పోలీసు స్టేషన్లో కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ తీసుకుందామని జర్నలిస్టుల బృందం భావించింది. దీని కోసం మళ్లీ వంగూరు వైపు వెళ్లేందుకు కార్లలో బయల్దేరారు. ఇదే సమయంలో కొండారెడ్డిపల్లి, వంగూరు రోడ్డుపై రెండు ఫార్చ్యూనర్ కార్లలో ఎనిమిది మంది యువకులు జర్నలిస్టుల బృందాన్ని చూడడంతో ‘అదిగో వాళ్లే.. మన న్యూస్ బయటకు వెళ్లకుండా ఉండాలి’ అంటూ జర్నలిస్టుల బృందం ఉన్న కార్లను వెంబడించారు. జర్నలిస్టుల బృందంలోని ఒక కారులోని కొంత మంది దీన్ని చూసి ముందున్న వారికి సమాచారం ఇచ్చారు. దీంతో ముందున్న మహిళా జర్నలిస్టులు కారు స్పీడ్ పెంచారు. అలా రోడ్డుపై వెళ్తుంటే దగ్గరలోనే వెల్దండ మండల పోలీసు స్టేషన్ కనిపించింది. దీంతో మహిళా జర్నలిస్టులు పోలీసు స్టేషన్లోకి వెళ్లారు.
వెల్దండ పోలీసు స్టేషన్ వద్ద జర్నలిస్టుల వాహనం ఆగడమే ఆలస్యం.. వారిని వెంబడిస్తున్న కొండారెడ్డిపల్లి కాంగ్రెస్ నాయకుల పార్చ్యూనర్ కార్లు కూడా వచ్చి ఆగాయి. జర్నలిస్టులు స్టేషన్ లోపలికి వెళ్లకముందే వారిని అడ్డుకుని బూతులు తిట్టారు. ‘కొండారెడ్డి పల్లెకు ఎందుకు వచ్చారు? మాకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తారా?’ అంటూ జర్నలిస్టు సరితను కొట్టేందుకు ఒకడు చెయ్యెత్తాడు. దీంతో నివ్వెరపోయిన ఆమె పోలీసు స్టేషన్లో కూడా మీ దౌర్జన్యం ఏమిటి? అని ప్రశ్నిస్తూ స్టేషన్‌లోపలికి వెళ్లింది. పోలీసులు దీనిని చూసినా కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తనపై హత్యాయత్నం జరిగిందని, పోలీసు స్టేషన్లోనే ఇది జరిగిందని సరిత స్థానిక ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చింది. సాక్ష్యాం ఉందా? అని ఎస్ఐ ప్రశ్నించడంతో ‘మీ పోలీసు స్టేషన్’ ముందున్న సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వండి. దాంట్లో ఉన్నది చూడండి అని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూసేందుకు, దాన్ని ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. తమకు రక్షణ కల్పించాలని జర్నలిస్టుల బృందం వేడుకున్నది. ఒకవైపు లోపల ఇది జరుగుతుంటే మరోవైపు పోలీసు స్టేషన్ బయట అచ్చం సినిమాల్లో చూపించిన దృశ్యమే కనిపించింది. సుమారు మరో పది వాహనాల్లో కొండారెడ్డిపల్లెకు చెందిన కాంగ్రెస్ వాళ్లు మాటు వేసి ఉన్నారు. బయట అంత మంది తమ కోసమే ఉన్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవా? అంటూ సరిత కన్నీటి పర్యంతమైంది. తమకు రక్షణ ఇవ్వరా? ఇదేమి రాజ్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నేను 15 ఏళ్లుగా మీడియాలో ఉన్నా. ఎక్కడా ఇలాంటి సంఘటనలు చూడలేదు. ఒక దశలో చంపేస్తారేమోనని అనిపించింది. పదుల సంఖ్యలో వారు మమ్మల్ని చుట్టుముట్టారు. మేం కొండారెడ్డిపల్లెకు వెళ్లడమే తప్పు అన్నట్టుగా మాట్లాడారు. భయభ్రాంతులకు గురిచేశారు. స్టేషన్‌కు వెళ్తే అక్కడా పట్టించుకోలేదు. మా సెల్ఫోన్లు గుంజుకున్నారు. కెమెరాలు, చిప్‌లు లాక్కున్నారు. అసభ్యకరంగా మాట్లాడారు. అనుచితంగా ప్రవర్తించారు. మా దగ్గర ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఇంత ఆటవిక పాలన ఉంటుందని ఊహించలేదు. మా పట్ల ప్రవర్తించిన తీరు హేయంగా ఉన్నది. ఇంత ఆటవికంగా ప్రవర్తిస్తారా? రాష్ట్రంలో మహిళలు పట్టపగలు కూడా ఊర్లలో తిరగవద్దా? రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రం కూడా మాకు లేదా? రుణమాఫీ జరిగిందని సీఎం చెప్తున్నారు. సీఎం ఊర్లో రైతులకు ఎంత లాభం జరిగిందో చూద్దామని వెళ్లినం. మేం నిష్పక్షపాతంగా వార్తలు ఇద్దామని వెళ్లాం. పోలీసుల తీరు నిరాశ కలిగించింది.
తమపై దాడి జరిగినట్టు మధ్యాహ్నం 12.30 గంటలకు మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి వంగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిన పోలీసులు.. రాజకీయ వర్గాలు, ప్రజలు, సీనియర్ పాత్రికేయుల నుంచి వస్తున్న విమర్శలతో రాత్రి 9 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు అనిల్ ఎరుకలి, చందుయాదవ్, శేఖర్ మల్లెపాకుల, కృష్ణ చాకలి, వంశీలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 126(2), 352, 351 (1), 79 ఆర్/డబ్ల్యూ, 3(5) కింద కేసు నమోదు చేశారు.
మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని చెప్పేందుకు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేస్తున్న గువ్వల మహిళా జర్నలిస్టులపై దాడి విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 40 శాతానికి మించి రుణమాఫీ జరగలేదన్నది జగమెరిగిన సత్యమని, ప్రభుత్వం మాత్రం 100 శాతం రుణమాఫీ చేశామని చెప్తున్నదని మండిపడ్డారు. రుణమాఫీపై నిజానిజాలు తెలుసుకునేందుకు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇంతకుమించి దుర్మార్గం ఉంటుందా? అని నిలదీశారు. దాడిని ఖండిస్తున్నామని, దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల మాటలతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు.. ‘మాకు రుణమాఫీ వస్తే మీకెందుకు? రాకుంటే మీకెందుకు?’ అంటూ గొడవకు దిగారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. వారి నుంచి ఫోన్లు, మెమొరీకార్డులు లాక్కున్నారు. వాటిని ఇవ్వకుండా ఆడుకున్నారు. కెమెరామెన్‌ను, కారు డ్రైవర్‌ను భయభ్రాంతులకు గురిచేశారు. కెమెరామెన్ నుంచి కెమెరా లాక్కున్నారు. సరితను తోసిపడేశారు. దీంతో ఆమె అక్కడున్న బురదలో పడిపోయారు. దీంతో విజయారెడ్డి తన కెమెరాతో ఈ ఘటనను రికార్డు చేయడం మొదలుపెట్టారు. మరో అల్లరిమూక విజయారెడ్డిని రౌండప్ చేసి ఆమె కెమెరానూ లాక్కున్నారు. దీంతో విజయారెడ్డి ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేయగా ఫోన్‌ను కూడా లాక్కున్నారు. తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఒకరి తర్వాత ఒకరు మొబైల్‌ను తీసుకుంటూ విజయారెడ్డిని చుట్టూ పరిగెత్తించారు. చివరకు ఒకడు ఆ మొబైల్‌ను తీసుకొని బైక్‌పై వెళ్లిపోయాడు. కెమెరా గుంజుకున్నవాడు ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. సరిత, విజయ బృందం తమ కార్లలో వెంటపడి కెమెరాలు తీసుకోగలిగారు. ఈ క్రమంలో తమ వెంటపడుతున్నవారితో సరిత, విజయారెడ్డి వాదిస్తూ.. ‘పోలీసు స్టేషన్‌కు వెళ్దాం. మేం రికార్డు చేసిన ప్రతీ వీడియో చూపిస్తాం’ అని చెప్పారు. దగ్గర్లోని వంగూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.
కొండారెడ్డిపల్లిలో జరిగిన సంఘటనను పలువురు సీనియర్ జర్నలిస్టులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్థానిక పార్టీ నాయకులతో మాట్లాడారు. గువ్వల బాలరాజు, ఎడ్మ సత్యం సహా నేతలందరినీ వెల్దండ పోలీసు స్టేషన్‌కు వెళ్లి జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా చూడాలని చెప్పా రు. దీంతోపాటు నాగర్‌కర్నూల్ ఎస్పీతో కూడా మాట్లాడారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకోవాలని, మహిళా జర్నలిస్టులపై ఎలాంటి అఘాయిత్యం జరగకుండా వారిని సురక్షితంగా హైదరాబాద్‌కు పంపించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి వారిని పంపించాలని విజ్ఙప్తి చేశారు. కేటీఆర్ ఫోన్ చేయడం, జర్నలిస్టు సంఘాలు కూడా కలుగజేసుకోవడంతో పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి జర్నలిస్టు బృందాన్ని హైదరాబాద్‌కు పంపించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిలపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలనగా పోజులు కొట్టే రేవంత్‌రెడ్డి పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా? అని ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులు ఏం తప్పు చేశారు? రేవంత్‌రెడ్డి లెక అడ్డమైన భాష మాట్లాడారా? అని నిప్పులు చెరిగారు. కొండారెడ్డి పల్లెలో రైతులకు రుణమాఫీ జరిగిందా? అని తెలుసుకోవడానికి వెళ్తే కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, రుణమాఫీ వందశాతం చేసింది నిజమైతే ఎందుకు భయం? అని ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులపై దాడిచేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంతగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై భౌతికదాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమాజ హితాన్ని కాంక్షించే జర్నలిస్టుల పట్ల దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిపై ప్రజాస్వామ్యవాదులు స్పందించాలని కోరారు.
జర్నలిస్టులపై జరిగిన దాడి హేయమని అని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో గురువారం మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడినవారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులు గుండాల్లా కెమెరాలు, వస్తువులు, ఫోన్లు లాకోవడం వారిపై దాడికి పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లోనే మహిళా జర్నలిస్టు సరితపై దాడికి పాల్పడిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? అనే అనుమానం కలుగుతున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా సమైక్య పాలకులను సోదరి సరిత ఎంతో ధైర్యంగా ప్రశ్నించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం అనుచరులు, కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. కొండారెడ్డిపల్లి ఏమైనా నిషేధిత ప్రాంతమా? ఎవరూ వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. 100 శాతం రుణమాఫీ జరిగితే కొండారెడ్డిపల్లిలోకి జర్నలిస్టులను ఎందుకు రానీయడం లేదని నిలదీశారు. రుణమాఫీ పేరుతో సర్కారు చేసిన అంకెలగారడీ బయటపడుతుందన్న భయంతోనే మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
మహిళా జర్నలిస్టు సరిత, విజయరెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, జర్నలిస్టుల విధులకు ఆటంకం కల్పించిన వ్యక్తులపట్ల కఠినంగా వ్య వహరించాలని డిమాండ్ చేస్తున్నట్టు మా జీ ఎంఎల్ఏ క్రాంతికిరణ్ అన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించా రు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తుండగా పోలీసు స్టేషన్లోనూ దాడి చేయడాన్ని బట్టి ఈ రాష్ట్రంలో సాధారణ ప్రజలకు ఎలాం టి భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మ హిళా జర్నలిస్టులపై దాడి హేయమని బెవరేజెస్ కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ దే వీప్రసాద్ పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని పూర్తిచేసినట్టు బుకాయిస్తున్నదని మండిపడ్డారు. రూ. 31వేల కో ట్ల రుణమాఫీని రూ.17వేల కోట్లకు తగ్గించి రైతులకు దగా చేసిందని మండిపడ్డారు. ప్ర భుత్వ చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలు తెలుపుతుంటే దాడులు చేస్తూ ప్రశ్నించే గొం తుకలను పోలీసుల ద్వారా నొకే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): సీఎం సొంత ఊరిలో రుణమాఫీ వివరాల సేకరణ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యానికి దిగినవారిలో కాంగ్రెస్ కార్యకర్త అనిల్ ప్రధాన కారకుడని తేలింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన అనిల్ తండ్రి కొన్నేండ్ల కిం దట మరణించగా.. తల్లి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నది. చెడు వ్యసనాలకు అలవా టు పడ్డ అనిల్, కాంగ్రెస్‌లో అభిమాన సం ఘం పేరుతో బీఆర్ఎస్ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం అధికార పార్టీ కార్యకర్తగా ఉంటూ సీఎం రేవంత్‌రెడ్డి వర్గీయుడిగా చెలామణి అవుతున్నాడు. వీధు ల వెంట తిరగడం.. బెదిరింపులకు పాల్పడడం అతడికి అలవాటుగా మారింది. గంజాయికి కూడా అలవాటు పడినట్టు సమాచారం.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగితే స్పందించాల్సిన మహిళా కమిషన్ అన్ని సందర్భాల్లో స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో మహిళా జర్నలిస్టులపై దాడి జరిగి, వారిపై హత్యాయత్నం జరిగితే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో గతకొంత కాలంగా దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలు, వేధింపులపై కమిషన్ స్పందించలేదని, కేవలం రాజకీయ ప్రేరేపిత అంశాలపై మాత్రమే స్పందిస్తున్నదన్న ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. ఇటీవల ఏదో రాజకీయ సభలో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేశారు. ఈ అంశాన్ని తాము సుమోటోగా తీసుకుంటున్నామని, దీనిపై కేటీఆర్ విచారణకు హాజరు కావాలంటూ మహిళా కమిషన్ ఎక్స్ వేదికగా పేర్కొన్న విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్టులపై దాడి, హత్యాయత్నం కేసులో మహిళా కమిషన్ స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. మహిళా కమిషన్ తీరుపై కొందరు జర్నలిస్టులు, మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తామే వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, డీజీపీని కూడా కలుస్తామని చెప్తున్నారు. ఇద్దరు సీనియర్ మహిళా జర్నలిస్టులపై దాడి జరిగితే స్పందించకపోవడం సరికాదని, మహిళా కమిషన్ రాజకీయ నిరుద్యోగ కమిషన్‌గా మారవద్దని ఆశిస్తున్నట్టు పలువురు మహిళా నాయకులు పేర్కొన్నారు.