హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఓ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బాధిత మహిళకు పోలీసులు భద్రత కల్పించాలని ఆదేశిస్తామని చెప్పింది. బాధితురాలు బుధవారం మహిళా సంఘాల నాయకులతో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు.
జానీమాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే జానీ కోసం పోలీసులు గాలిస్తుండగా, తాజాగా బాధితురాలు మమిళా కమిషన్‌ను ఆశ్రయించింది. బాధిత మహిళకు కమిషన్ అండగా ఉంటుందని చైర్పర్సన్ శారద వారికి భరోసా ఇచ్చారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారెవరైనా వదిలేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బాధితురాలికి రక్షణ లేదని, ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తానని ఆమె తెలిపారు.
మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన జానీమాస్టర్ఫై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ ఫిల్మ్ చాంబర్లో లైంగిక వేధింపుల ఫిర్యాదుల ప్యానల్ ఉన్నప్పటికీ మహిళలపై వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని, ఈ ప్యానల్ మహిళలకు ధైర్యం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.
ప్యానల్ చిత్తశుద్ధితో వ్యవహరించి జానీమాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకొని, భాదితురాలికి అండగా ఉండాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వరింగ్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి డిమాండ్ చేశారు.