హైదరాబాద్ : టూరిస్టులుగా రాష్ట్రానికి వస్తున్న ప్లరిస్టులు అవగాహన లేమితో ఫూలిష్ గా మాట్లాడటం మానుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మధ్య వలస పక్షుల్లా రాష్ట్రానికి వరసగా వస్తున్న కొందరు బిజెపి నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.
స్థానిక బిజెపి నేతలు ఇచ్చిన ప్రాంప్టింగ్ ని తు.చ. తప్పకుండా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడికిగానీ, కేంద్ర మంత్రులుగానీ, వరంగల్‌కి వచ్చిన అసోం సీఎం బిశ్వ శర్మ మాటలు గానీ చూస్తే వారి తెలివిడి బయట పడుతుందన్నారు. మీరు సీఎంగా సామాన్య ప్రజల్ని కలవడానికి ప్రత్యేకంగా సమయం ఇస్తారు. కానీ మా సీఎం సామాన్య ప్రజలతో కలిసి ఉంటారనే అన్న విషయం మీకు తెలుసా? అని అసోం సీఎం ని మంత్రి ప్రశ్నించారు.
తెలంగాణలో ఇప్పటికే లక్షా 32వేల ఉద్యోగాలిచ్చాం. ఉద్యోగ ఖాళీలను నింపుతున్నాం. మీరు ఇస్తానన్న ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేమయ్యాయి? చెప్పగలరా? 2014లో ఇచ్చిన ఆ హామీ ప్రకారం ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి? అవేమయ్యాయి? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనలో విఫలమైంది ఎవరు? మీరా? మేమా? అని అస్సాం సీఎంని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ పథకం అమలు చేస్తున్నదెవరు? మీ జల్ శక్తి మిషన్ పథకం, మా మిషన్ భగీరథకు కాపీ కాదా? ఒకవైపు మా పథకాలను కాపీ కొడతారు. ఉభయ సభల్లో అభినందించి అవార్డులు, రివార్డులు ఇస్తారు. ఇక్కడకు వచ్చి మీరేం చేశారని ప్రశ్నిస్తారా? ఇదేనా మీ బిజెపి సంస్కృతి? అంటూ మంత్రి ఎర్రబెల్లి బిజెపి నేతల వైఖరిని ఎండగట్టారు.
బిజెపి నేతలు సహా, ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి రావొచ్చు. పోవచ్చు. మీటింగులు పెట్టుకోవచ్చు కానీ, సీఎం కేసీఆర్ మీద మాట్లాడటానికి సాహసించవద్దు. అయితే, గియితే, ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని హెచ్చరించారు. మీ రాష్ట్రాలు, దేశంలోని వివిధ పథకాలు, మా తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు, వాటి అమలు తీరుపై, అభివృద్ధి, సంక్షేమాలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.