హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ డిప్లొమా/పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌పై సందిగ్ధత నెలకొన్నది. ఈ ఏడాది పాలిసెట్ ఉంటుందా..? ఉండదా.. ? అన్న అనుమానాలొస్తున్నాయి. గతంలో పాలిసెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలోనే విడుదల చేసింది. ఇప్పుడేమో మార్చి మూడో వారం సమీపించినా నోటిఫికేషన్ విడుదలకాలేదు. మరోవైపు పదో తరగతి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్‌టికెట్ల ఆధారంగా పాలిసెట్‌కు దరఖాస్తు చేసే అవకాశముంది.
గతంలో పాలిసెట్ నోటిఫికేషన్ ముందుగా వచ్చేది.. ఎస్సెస్సీ హాల్‌టికెట్లు ఆలస్యంగా విడుదలయ్యేవి. కానిప్పుడు పది హాల్‌టికెట్లు విడుదలైనా పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలకాలేదు. దీంతో పాలిటెక్నిక్ కాలేజీలు, విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మరింత ఆలస్యమైతే పాలిసెట్ పరీక్షాతేదీ, దరఖాస్తుల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపనున్నది. అధికారులను ఆరా తీస్తే త్వరలోనే ఇస్తామన్న సమాధానం తప్ప మరొకటి రావడంలేదు.