కుళ్లిన కూరగాయలు.. అన్నంలో పురుగులు.. అపరిశుభ్ర వాతావరణం.. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బయటపడుతున్నది. సరిగా ఉడకని, ముద్దలు కట్టిన అన్నం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యలు తెలుసుకునేందుకు గురుకులాలకు వచ్చే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పలుచోట్ల గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేస్తూ లోనికి వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
Gurukula Schools | బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 4 : ‘గురుకుల బాట’కు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో గురుకుల బాట కమిటీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన గురుకుల బాట ఉద్రిక్తతకు దారితీసింది. రాజారాం యాదవ్, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు మండలంలోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పాఠశాల గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. లోపలికి వెళ్లకుండా వారిని అరెస్టు చేసి బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించాలనే సత్సంకల్పంతో కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిం దని చెప్పారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి సబ్బని హరీశ్ ఆధ్వర్యంలో సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సిపాల్ రఫత్ అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు.
ఇనుగుర్తి, డిసెంబర్ 4: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థినులకు ముద్ద అన్నం.. నీళ్ల చికెన్‌తో భోజనం పెడుతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ బుధవారం గురుకులాన్ని సందర్శించి, వంటశాలను పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడగా తమ కు రోజూ ముద్దల అన్నం పెడుతున్నారని, నీళ్లకూరలు పెడుతున్నారని తెలిపారు. పాఠశాలలో, హాస్టల్ తమతోనే పనులు చేయి స్తున్నారని వాపోయారు. బోరువాటరే తాగుతున్నామని, టాయ్‌లెట్స్ సక్రమంగా లేవన్నారు. ఎమ్మెల్యే మాత్రం పాఠశాలలో అన్నీ బాగానే ఉన్నాయని చెప్పడం గమనార్హం.
ఆత్మకూరు, డిసెంబర్ 4 : అన్నంలో పురుగులు.. కుళ్లిన కూరగాయలతో వంట చేయగా తినేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గురుకుల బాటలో భాగంగా బీఆర్ఎస్వీ నాయకులు బుధవారం ఆత్మకూరు మండల ం బాలకిష్టాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. బీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి శివప్రసాద్ యాదవ్, బీఆర్ఎస్వీ మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి రియాజ్, జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ తదితరులు విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా.. అన్నంలో పురుగులు బయటపడ్డాయి. వంటగదిని పరిశీలించగా శుచి, శుభ్రత లేకుండా దర్శనమిచ్చింది. కుళ్లిన కూరగాయలు, మురిగిపోయిన బీరకాయలు వెలుగుచూశాయి. విద్యార్థినుల సమస్యలపై అధికారులను నిలదీయగా తప్పించుకునే ప్రయత్నం చేశారు.
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 4 : బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలు చేపట్టిన గురుకులబాటలో ఉద్రిక్తత నెలకొన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల సందర్శనకు బుధవారం నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, మహిళా కౌన్సిలర్లు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ విష్ణుసాగర్తోపాటు పలువురు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అనుమతి లేదంటూ ఎస్సై గోవర్ధన్ నేతలను అడ్డుకున్నారు. బలవంతం గా పాఠశాల బయటకు తోసేసి గేటుకు తాళం వేశారు. అనంతరం 30 మంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చందంపేట (దేవరకొండ), డిసెంబర్ 4 : గురుకులాలు, వసతి గృహాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మండిపడ్డారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బుధవారం ఆయన పరామర్శించారు. పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినుల అస్వస్థతపై జిల్లా అధికారులు స్పందించారు. బుధవారం జిల్లా వైద్యాధికారి శ్రీనువాస్, ముగ్గురు డాక్టర్లు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు.