మునిపల్లి, డిసెంబర్ 2: కుటుంబ కలహాలతో భార్య.. భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. మునిపల్లి ఎస్సై రాజేశ్‌నాయక్ కథనం ప్రకారం.. మునిపల్లి మండలం మక్తక్యాసారం గ్రామానికి చెందిన మంజులకు హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌కు చెందిన సంపత్తో 12 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పంచాయితీ పెట్టినా గొడవలు తగ్గకపోవడంతో భర్తతో కొట్లాడి భార్య తల్లిగారి ఇంటికి వెళ్లింది. అప్పటినుంచి భర్త సంపత్ భార్యను చూసేందుకు అప్పడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. పది రోజుల క్రితం సంపత్ మక్తక్యాసారం గ్రామానికి వచ్చి భార్య దగ్గరే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మంజుల.. భర్తను కర్రతో కొట్టి ఇంట్లో నుంచి బయటకు తోసేసింది. తలకు బలమైన గాయం కావడంతో సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.