హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): స్త్రీలు వివక్షకు, వేధింపులకు గురికాకుండా కాపాడేందుకు తెచ్చిన చట్టాలు కొందరు మగవారి పాలిట శాపాలయ్యాయని అంటున్నారు భార్యాబాధితులు. 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, అంతకన్నా ముందే వచ్చిన వరకట్న వేధింపుల నిరోధక చట్టాన్ని ఉపయోగించుకొని భార్యలు తమను వేధిస్తున్నారని ఆవేదనను వెళ్లగక్కారు. శనివారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్) ఆధ్వర్యంలో రెండు (16, 17వ తేదీల్లో) రోజుల సదస్సును ఏర్పాటు చేశారు. సమావేశంలో భార్యాబాధితులు తమ బాధలు చెప్పుకొన్నారు. దేశంలో వివాహ చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయని, వాటిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లింగ సమానత్వం గురించి మాట్లాడేవారు.. సమాన హక్కులు కావాలనే తమ న్యాయమైన కోర్కెలకు మద్దతు పలకాలని కోరారు.
కొన్ని కేసుల్లో అన్యాయంగా తమ తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన వారి ఉసురు పోసుకుంటున్నారని వాపోయారు. తాము మహిళా హక్కులకు, వారి వికాసానికి ఏమాత్రం అడ్డు కాదని, డబ్బుల కోసం తప్పుడు కేసులు మోపి పీడించొద్దని వేడుకున్నారు. భార్యల వేధింపుల వల్ల మానసిక రుగ్మతలకు గురై కొందరు భర్తలు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని తెలిపారు. గత కొన్నేండ్లుగా పురుషుల హక్కుల కోసం పనిచేస్తున్న సిఫ్ వ్యవస్థాపకుడు అనిల్ ఆధ్వర్యలో వలంటీర్స్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. సమాన హక్కులు వర్తించే వరకూ.. వివాహాలను బహిష్కరించాలని నినాదాలు చేశారు. నేషనల్ మెన్స్ రైట్స్ సదస్సుకు సుమారు 200 మంది హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు.
ఆస్తికోసం కేసులు వేశారు
వదిన వేధింపులతో మనోవేదనకు గురైన అన్న ఆత్మహత్య చేసుకొన్నాడు. సీనియర్ సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. ఆయనకు 60 వేల జీతం వచ్చేది. వయసు చిన్నదే. ఆమెకు పిల్లలు లేరు. ఆమెకు వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసుకొమ్మన్నాం. కానీ నాతోపాటు మా అమ్మపై వేధింపుల కేసు నమోదు చేసింది. మా నాన్నకు పక్షవాతం. అందువల్ల ఆయనపై కేసుపెట్టలేదు. మా భార్యపై కూడా కేసు పెట్టింది. మళ్లీ ఎందుకో వెనుకకు తీసుకొన్నది. నేను ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడిని. రెండు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది న్యాయమేనా? ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. జీవనం వెళ్లదీస్తున్నాను.
– సాయికుమార్, ఆర్మూర్