హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పండ్ల తోటలకు అవసరమైన నాణ్యమైన మొకల ఉత్పత్తి, సరఫరా-డిమాండ్ మధ్య భారీ అంతరం ఏర్పడటంతో ప్రస్తుతం ఈ రంగంలో ఉద్యాన నిపుణులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ హార్టికల్చర్ విభాగం డీన్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన మొకల ఉత్పత్తి, పండ్ల తోటల పెంపకం, నిర్వహణపై సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులు ఆదివారం సంగారెడ్డిలోని ఫల పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పండ్ల తోటల నర్సరీలకు రాష్ట్రంలో అత్యంత అనువైన వాతావరణం ఉన్నదని, దీన్ని ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తకువ ఖర్చుతో నాణ్యమైన మొకల ఉత్పత్తి, అంటు కట్టే విధానం, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డాక్టర్ పీ హరికాంత్ వివరించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య, డాక్టర్ జే శ్రీనివాస్, డాక్టర్ నితీశ్, విద్యార్థులు, వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు.